Harish Rao Demands: రైతులకు క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao fires on Revanth Reddy Government: స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతుభరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపాలని, 19 నెలల్లో రైతులను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.వేల చొప్పున ఇస్తామని చెప్పి రూ.12వేలకు పరిమితం చేయడం మోసం చేయడమేనని మండిపడ్డారు.
గత వానకాలం, యాసంగిలో రైతుభరోసా ఎగ్గొట్టారని, ఇప్పుడు ఓట్ల కోసం విజయోత్సవాల పేరిట సంబురాలు చేయడం రైతులను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టారని, అధికారంలోకి వచ్చిన తర్వాత నిండా ముంచారని ఫైర్ అయ్యారు. రైతులకు ఏం చేశారని సంబురాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు సంబురాలు చేస్తున్నారా? అని నిలదీశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా రైతులు ఉన్నారని తెలిపారు. నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లో కుప్ప కూలుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ది రైతుసంక్షేమ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ ది రైతు సంక్షోభ ప్రభుత్వమని ఆరోపించారు.
కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చారని, కాంగ్రెస్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా ఇచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న జిమ్మిక్కులను రైతులు నమ్మరన్నారు. రైతులు కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు.. క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలన్నారు.