Sajjala Ramakrishna Reddy : యువత పోరుతో ప్రభుత్వాన్ని నిలదీద్దాం : సజ్జల

Sajjala Ramakrishna Reddy : ఈ నెల 12న యువత పోరుతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా యవకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. రూ.3900 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకాయిలు ఉన్నాయని, బడ్జెట్‌లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫీజు చెల్లించకపోవడంతో కళాశాలల నుంచి విద్యార్థులను వెళ్లగొడుతున్నారని, దిక్కుతోచని పరిస్థితిలో విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని, ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.
హామీలు విస్మరించిన చంద్రబాబు..
నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారని ఆరోపించారు. 20 లక్షల ఉద్యోగాలు, ప్రతినెలా రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమయ్యింది? అని ప్రశ్నించారు. వైద్యరంగాన్ని రంగం బలోపేతానికి వైసీపీ హయాంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టామన్నారు. ఐదు కళాశాలల నిర్మాణం పూర్తయ్యాయని, తరగతులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగిలిన కళాశాలలను పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించాల్సి ఉందని, కానీ, వాటిని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ క్రమంలో వైసీపీ యువతకు, విద్యార్థులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాటానికి సిద్ధమైందన్నారు. ఇందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతో వైసీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సజ్జల పేర్కొన్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో వైసీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలని పేర్కొన్నారు. మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు నియోజకవర్గ ఇన్‌చార్జిలు చర్యలు తీసుకోవాలని సజ్జల సూచించారు.