Vontimitta : ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Vontimitta : కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. విజయవాడ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు స్వామి వారి ప్రసాదం చంద్రబాబు దంపతులకు అందజేశారు.
చంద్రబాబు దంపతులకు వేదపండితుల ఆశీర్వాదం..
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులను వేదపండితుల ఆశీర్వదించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున ఒంటిమిట్టకు చేరుకున్నారు.
టీటీడీ అతిథి గృహంలో బస..
రాత్రికి సీఎం చంద్రబాబు దంపతులు స్థానిక టీటీడీ అతిథి గృహంలో బస చేయనున్నారు. శనివారం ఉదయం 9.00 గంటలకు ఒంటిమిట్ట నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం వడ్లమానులో పర్యటించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.