TTD : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్జిత సేవల కోటా రిలీజ్ ఎప్పుడంటే..?

TTD : తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు సుప్రభాతం, అష్టదళ పాదపద్మారాధన, ప్రత్యేక దర్శనం టికెట్లు, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి 24 వరకు దశలవారీగా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10కి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 19 ఉదయం 10 నుంచి 21న ఉదయం 10 వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 21 నుంచి 23వ మధ్యాహ్నం 12 గంటలోగా డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది.
ఈ నెల 22న వెబ్‌సైట్‌లో అందుబాటులో టికెట్లు..
ఆర్జిత సేవలు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను ఈ నెల 22న ఉదయం 10కి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను విడుదల చేయనున్నట్లు వివరించింది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10కి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించిన భక్తులకు కేటాయించే దర్శన టికెట్ల జూన్ నెల ఆన్‌లైన్ కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ఉద్దేశించిన జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి..
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులకు సంబంధించిన కోటాను విడుదల చేస్తామని వెల్లడించింది. భక్తులు ఆర్జిత సేవలు, టికెట్లు, వసతి గదుల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాలని కోరింది.