YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు.. ఉదయ్ కుమార్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

Update on YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో గజ్జల పాత్ర ఏమిటని సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్‌రెడ్డి ఒకరని సునీత తరఫు లాయర్లు కోర్టుకు వివరించారు. దీంతో సుప్రీం ఉదయ్ కుమార్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్లతో ఈ పిటిషన్‌ను జతచేయాలని సూచించింది. తదుపరి విచారణను సుప్రీం వాయిదా వేసింది.
సీబీఐని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
వివేకా హత్య కేసు విచారణలో ఏం జరుగుతోందని తెలంగాణ హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. 19 నెలలుగా సీబీఐ కోర్టులో విచారణ ఒకేదశలో ఉందని, ముందుకు కదలడం లేదని వ్యాఖ్యానించింది. సీఆర్పీసీ 207 ప్రాసిక్యూషన్ పత్రాల కాపీలను నిందితులకు అందజేయడం ఇంకా ఎన్నేళ్లు పడుతుందని ప్రశ్నించింది. సీబీఐ సమర్పించిన హార్డ్‌డిస్క్‌లలోని 13 లక్షల పత్రాల్లో 11 లక్షలు తెరవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగింది. వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరికి కడప కోర్టు క్షమాభిక్ష పెడుతూ అప్రూవర్‌గా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తూ..
దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. మూడు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. వివేకా హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో ఏ దశలో ఉందని ప్రశ్నించారు. సీబీఐ సమర్పించిన 13 లక్షల పత్రాల్లో ఇప్పటివరకు దాదాపు 2.30 లక్షలు తెరిచినట్లు లాయర్లు పేర్కొన్నారు. ఇంకా మిగతా 11 లక్షలు తెరవడానికి ఎంత సమయం పడుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు.
నిందితులకు కొత్త హార్డ్‌డిస్కులు..
సమస్యను పరిష్కరించడానికి నిందితులకు కొత్త హార్డ్‌డిస్కులు ఇచ్చినట్లు సీబీఐ తరఫు లాయర్ కాపాటి శ్రీనివాస్ తెలిపారు. దస్తగిరికి క్షమాభిక్ష పెట్టడం సరికాదని పిటిషనర్ల తరఫు లాయర్లు తెలిపారు. తమ పిటిషన్లపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసిందని, పూర్తిస్థాయి వాదనలకు సమయం కేటాయించాలని కోరారు. వివేకా కుమార్తె సునీత తరఫు లాయర్ ఎస్.గౌతమ్ వాదనలు వినిపించారు. దస్తగిరికి కడప కోర్టు ఇచ్చిన క్షమాభిక్ష కేసులో ఇప్పటికే ఇంప్లీడ్ అయ్యామని తెలిపారు. సీబీఐ కోర్టు సాక్షిగా గుర్తించిన కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాదనలు విన్న తర్వాత ఈ నెల 16న పూర్తి స్థాయి వాదనలు వింటామని తెలిపారు. హత్య కేసు విచారణను వేగవంతం చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సీజే ధర్మాసనానికి బదిలీ చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.