Last Updated:

Godavari Districts MLC : ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల విజయం

Godavari Districts MLC : ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల విజయం

Godavari Districts MLC : ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు. 7వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి విజయానికి కావాల్సిన ఓట్లు (51శాతం) సాధించారు. దీంతో మరో రౌండ్ లెక్కింపు ఉండగానే రాజశేఖరం గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ పేరాబత్తులకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

7 రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తంగా 1,12,331 ఓట్లను రాజశేఖరం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన దిడ్ల వీర రాఘవులుకు 41,268 ఓట్లు పోలు కాగా, కూటమి అభ్యర్థి 71,063 ఓట్లతో విజయం సాధించారు. 7 రౌండ్లు పూర్తయ్యే సరికి 1,96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యింది. చెల్లిన ఓట్లు 1,78,422 ఉండగా, చెల్లనివి 17,578 ఉన్నాయి. దాదాపు 22,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది.

గ్రాడ్యుయేట్‌ల హక్కుల సాధనకు కృషి : పేరాబత్తుల
కూటమి అభ్యర్థిగా విజయం సాధించినందుకు తనకు సంతోసంగా ఉందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండు జిల్లాల గ్రాడ్యుయేట్ల ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రాడ్యుయేట్‌ల హక్కుల సాధన కోసం కృషిచేస్తానని చెప్పారు. నిరుద్యోగ యువత పట్ల గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం డీఎస్పీపై చేశారని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే డీఎస్పీ నోటిఫికేషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో నిరుద్యోగ యువత లేకుండా అందరికీ ఉద్యోగాలు వచ్చేలా తనవంతు కృషిచేస్తానని తెలిపారు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్లకు మంగళవారం తెల్లవారుజామున చివరి రౌండ్ పూర్తయ్యే సరికి 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7 రౌండ్ ముగిసే సరికి 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలు కాగా, 7వ రౌండ్ పూర్తియ్యే సరికి 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో రాజేంద్రప్రసాద్‌ను విజేతగా ప్రకటించారు. 9వ రౌండ్ పూర్తయ్యే సరికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావు 62,737 ఓట్లు సాధించారు. ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజార్టీ దక్కింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఓట్లను ఆలపాటి రాజేంద్రప్రసాద్ సాధించారు.

ఇవి కూడా చదవండి: