Zakir Hussain: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్పేన్ కన్నుమూత
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మవిభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం(డిసెంబర్ 15) రాత్రి అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. బాలీవుడ్‌లో సంగీత దర్శకునిగా తనదైన ముద్ర వేసుకున్న ఆయన పదేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు.
అయితే కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించారు.
ఆయన అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లరఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యాకారుడు అల్లారఖా పెద్ద కుమారుడు ఈయన. తండ్రి బాటలోనే నడుస్తూ చిరుప్రాయంలోనే తబలా వాయిద్యాకారుడిగా మారారు. మూడు సంవత్సరాల వయసులోనే తబలా వాయించడం నేర్చుకున్నారు. ఏడేళ్ల వయసులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు ప్రారంభించారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ప్యూజన్‌లో నైపుణ్యం సాధించిన తనదైన ముద్ర వేసుకున్నారు.