Last Updated:

AP Graduate MLC Elections: టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. ఓటేయనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్లు

AP Graduate MLC Elections: టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. ఓటేయనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్లు

AP Graduate MLC Elections: నేడు జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మొత్తం 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో యూటీ ఎఫ్‌ తరపున గెలిచిన షేక్‌ సాబ్జి రోడ్డు ప్రమా దంలో మృతిచెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైందన్న సంగతి తెలిసిందే.

అభ్యర్థులు వీరే..
ఈ ఎన్నికల్లో యూటీఎఫ్‌ నేత బొర్రా గోపీమూర్తి, గంధం నారాయణ రావు, డా. కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్‌, నామన వెంకట లక్ష్మి (విళ్ల లక్ష్మి) పోటీలో నిలిచారు. వీరిలో గోపిమూర్తి, నారాయణరావు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వీరిలో గోపిమూర్తి తొలిసారి బరిలో ఉండగా, నారాయణరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గోపిమూర్తికి యూటీఎఫ్‌తో పాటు పలు సంఘాలు మద్దతునివ్వగా, నారాయణరావుకు ఎస్టీయూ, మరికొన్ని సంఘాలు అండగా నిలిచాయి. సీనియరైన తనకు ఒక ఛాన్సిస్తే.. టీచర్ల సమస్యలను పరిష్క రిస్తామని గంధం నారాయణరావు ప్రచారం చేయగా, షేక్‌ సాబ్జీ మరణానంతరం టీచర్ల హక్కులను కాపాడే సత్తా తనకే ఉందని యూటిఎఫ్‌ బలపరచన గోపిమూర్తి కోరుతున్నారు.

ఆరు నూతన జిల్లాల పరిధిలో..
ఆరు జిల్లాల పరిధిలోని 16,737 మంది టీచర్ల కోసం అధికారులు 116 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కాకినాడ జిల్లాలో 3418 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 2990, డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 3296, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637, పశ్చిమగోదావరి జిల్లాలో 3729, ఏలూరు జిల్లాలో 2667 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను సురక్షి తంగా కాకి నాడ జేఎన్‌టీయూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌‌కు తరలించనున్నారు.ఈనెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నెల 12వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగుస్తుంది.

ఓటు వేసేందుకు క్యాజువల్‌ లీవ్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ రోజున స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే టీచర్లు ఓటేసేందుకు వీలుగా ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక గంట అనుమతి ఇవ్వాలని, వీలుంటే షిప్ట్‌ల అడ్జస్ట్‌మెంటు చేసుకోవాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. పోలింగ్ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 నుంచి గురువారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం డిపోలు, దుకాణాలు, బార్‌లు మూసి ఉంచాలన్నారు. పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించారు.