Last Updated:

Kakinada Sea Port: ఆపరేషన్ స్టెల్లా.. లోతైన విచారణ దిశగా ఏపీ సర్కారు.. ఐదు విభాగాల అధికారులతో తనిఖీలు

Kakinada Sea Port: ఆపరేషన్ స్టెల్లా.. లోతైన విచారణ దిశగా ఏపీ సర్కారు.. ఐదు విభాగాల అధికారులతో తనిఖీలు

Inspection In Stella El Ship in kakinada: రేషన్ బియ్యం ఎగుమ‌తి కోసం కాకినాడ‌ పోర్టులో లంగ‌ర్ వేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో బుధవారం అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో బృందం సముద్రంలోకి వెళ్లారు. ఈ మల్టీ డిసిప్లీనరీ కమిటీ బృందం రేషన్ బియ్య నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్ కు పంపి అందులో ఉన్న‌వి రేష‌న్ బియ్య‌మా కాదా అనేది నిగ్గు తేల్చ‌నున్నారు.

ఎలా చేద్దాం?
బుధవారం విచారణకు వెళ్లిన అధికారుల బృందం నౌకలో 5 హాచెస్ ఉండగా, ఇప్పటివరకు 3 హాచెస్​లో బియ్యాన్ని నింపినట్లు నిర్ధారించింది. నౌకలో 15 అడుగుల లోతులో బియ్యం నింపటం చూసిన అధికారులు.. పై వరుసల్లోని బస్తాల్లోని బియ్యం నమూనాలను సేకరించారు. స్టెల్లా నౌక 58 వేల టన్నుల సామర్థ్యం ఉండగా ఇప్పటికే 38 వేల టన్నుల బియ్యాన్ని నింపారు. సేకరించిన నమూనాలు పరీక్షలు చేసిన అనంతరం రేషన్ బియ్యం ఎంత మేర ఉందనేది తేల్చనున్నారు. ఆ తర్వాత నౌకలో బియ్యం సీజ్ చేయాలా లేదంటే నౌకనే సీజ్ చేయాలన్న అంశం అధికారులు తేల్చనున్నారు.

విచారణలో వాస్తవాలు..
అధికారుల సహకారం వల్లే గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు బియ్యం సరఫరా జరుగుతుందని ఆరా తీసినట్లు తెలుస్తోంది. రేషన్‌ బియ్యం విదేశీ ఎగుమతులకు అడ్డాగా తయారైన కాకినాడ పోర్టులోనే..బియ్యం రీసైక్లింగ్‌ కూడా జరుగుతుందట. పోర్టులోని గోదాములను లీజుకు తీసుకుని రేషన్‌ బియ్యాన్ని నూకలు చేయడం, పాలిష్‌ పట్టి సిల్కీ రైస్‌గా మార్చడానికి యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారట.

సీజ్ సాధ్యమేనా?
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకను సీజ్ చేయడం అసాధ్యమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. నౌక సీజ్ కోసం కేసు పెట్టిన ఏపీ అధికారులు అది అడ్మిరాలజీ న్యాయస్థానంలో నిలబడే అవకావం చాలా తక్కువని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేయడం కష్టమైన పని, నిపుణులతో మాట్లాడిన తర్వాత ఓ అంచనాకు వచ్చారు. అదే సమయంలో.. కాకినాడ పోర్టు భద్రతలో భాగంగా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ CSOను నియమిస్తారట. ఆయన ఆధ్వర్యంలోనే పోర్టు పరిసర ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయనున్నారు. షిఫ్టుల వారిగా అధికారులు..అవసరమైతే సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోర్టును తమ అధీనంలోకి తీసుకుంటే రేషన్‌ బియ్యం మాఫియాను చావు దెబ్బ కొట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.

పవన్ ఎఫెక్ట్
కాగా, ఈ నౌకలో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ నవంబరు 27న ప్రకటించారు. ఈ వార్త తెలుసుకున్న డిప్యూటీ సీఎం నవంబరు 29న కాకినాడ పోర్టును సందర్శించి ఇక్కడి భద్రత వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే ‘సీజ్ ద షిప్’ అని ఆదేశించారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపు మళ్లింది. గత అయిదేళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం రావటంతో ఈ వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళనకు నిర్ణయించింది. ఈనేపథ్యంలో అయిదు విభాగాల‌తో కూడిన ఏర్పాటు చేసిన బృందం బుధవారం నౌకను పరిశీలించింది. ఈ బియ్యం ఎవ‌రి ద్వారా ఎగుమ‌తి అవుతున్నాయో వివ‌రాల‌ను సైతం పోర్టు అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఎంత రేషన్ బియ్యం వున్నాయో గుర్తించి సీజ్ చేసి నౌకను పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నౌకలో పూర్తి బియ్యం లోడింగ్‌కు ఇంకా వారం రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది.