AP Cabinet Meeting: రేపే ఏపీ మంత్రివర్గ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ
AP Cabinet Meeting on Tuesday: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రీషెడ్యూలులో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. చెత్తపన్ను రద్దుపైనా.. 13 మున్సిపాలిటీలలో 190 పోస్టుల భర్తీపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.
సంక్షేమంపై చర్చ
అదే విధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ భేటీలో ఉచిత బస్సుతో పాటుగా రైతులకు రూ 20 వేల నగదు జమ అంశం పైనా చర్చించనున్నారు.కొత్త పెన్షన్ల మంజూరు పైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 2 నుంచి జన్మభూమి -2 ప్రారంభం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
విధాన పరమైన నిర్ణయాలు..
కొత్త రూపొందించిన విజన్ 20247ను మంత్రివర్గ భేటీలో చర్చించి, ఆమోదించనున్నారు. పది కీలక రంగాలను గుర్తించి వాటిని సమర్థవంతంగా అభివృద్ధి చేయగలిగితే పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తున్న వేళ ఈ పాలసీమీ లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది.
కాకినాడ అంశంపై..
పవన్ కల్యాణ్ లేవనెత్తిన బియ్యం మాఫియా అంశం పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. రేషన్ వ్యవస్థలోని లోపాల మీద, కొత్త రేషన్ కార్డులతో పాటుగా పెన్షన్ల దరఖాస్తుల ఖరారు మార్గదర్శకాల పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.