Last Updated:

Minister Nadendla: జగన్ కనుసన్నల్లోనే రేషన్ దందా.. దేశ భద్రతపై పవన్ మాట్లాడిన దానిలో తప్పేముంది?

Minister Nadendla: జగన్ కనుసన్నల్లోనే రేషన్ దందా.. దేశ భద్రతపై పవన్ మాట్లాడిన దానిలో తప్పేముంది?

Minister Nadendla Manohar Speaks to Media over Rice Export Issue: కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని, గత వైసీపీ ప్రభుత్వం ఈ పోర్టును పూర్తిగా అందుకోసమే వినియోగించిందని జనసేన సీనియర్ నేత, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు నుంచి గడచిన మూడేళ్లలో రూ. 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని ఆయన మండిపడ్డారు. దీనికోసమే కాకినాడు పోర్టు పాత యాజమాన్యం మెడమీద కత్తి పెట్టి మరీ అరబిందో సంస్థకు పోర్టులో వాటాలు దక్కేలా చేశారని మంత్రి ఆరోపించారు. ఈ వ్యవహారం మీద కూటమి ప్రభుత్వం విచారణ జరిపించి అసలైన దోషులను ప్రజల ముందు నిలబెడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆ పథకం అందుకే..
గత ప్రభుత్వం వాహనాల ద్వారా ఇంటి వద్దనే బియ్యం డోర్ డెలివరీ అంటూ తెచ్చిన పథకం.. అక్రమ రవాణా కోసమేనని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ఆ పథకం కోసం సుమారు 1000 వాహనాలు కొని రూ. 16 వేల కోట్లు దండగ చేశారన్నారు. గ్రామాల్లో బియ్యం వద్దనేవారికి రూ. 10 చొప్పున డబ్బులిచ్చారని, అసలు తీసుకోని వారి బియ్యాన్ని దోచుకున్నారన్నారని మంత్రి ఆరోపించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు జాతీయ రహదారి మీద అధికారులను మేనేజ్ చేసి రేషన్ బియ్యాన్ని కాకినాడకు తరలించి, అక్కడి పోర్టు ద్వారా అమ్మేశారని, ఒక్క కరోనా సమయంలోనే రూ 6,300 కోట్ల విలువైన బియ్యాన్ని దేశం దాటించి దండుకున్నారని మంత్రి వివరించారు.

బెదిరించి లాక్కున్నారు..
2020 సెప్టెంబరు చివరి వారంలో జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్‌ను అరబిందో రియాల్టీ సంస్థ భారీ డీల్‌తో దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా పోర్టులో జీఎంఆర్ సంస్థకున్న వాటాల్లో 51 శాతాన్ని అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 2,610 కోట్లకు కొనుగోలు చేసింది. జీఎంఆర్ సెజ్ కింద తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ వద్ద దాదాపు పదివేల ఎకరాలుండగా, అక్కడి కోన అనే గ్రామం వద్ద నూతన పోర్టు నిర్మిస్తామని గతంలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో జీఎంఆర్ సంస్థ హామీఇచ్చింది. ఎప్పుడైతే, ఇందులోని వాటాలు అరబిందోకు బదిలీ అయ్యాయో.. నాటి నూతన పోర్టు నిర్మాణం మాట పక్కనబెట్టేసి నేరుగా కాకినాడ పోర్టునే టేకోవర్ చేయటం మీద అరబిందో రియాల్టీ యజమానులు దృష్టి పెట్టారు. ఈ డీల్ కోసం నాటి కాకినాడ పోర్టు ఓనర్ కేవీ రావు మీద నాటి జగన్ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చిన తర్వాతే.. ఆయన బంధువైన విజయసాయి రెడ్డి అల్లుడికి కాకినాడ పోర్టులో వాటాలు దక్కాయని మంత్రి మనోహర్ ఆరోపించారు.

అంతా రహస్యం..
కాకినాడ పోర్టు లోపల ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి తెలియకుండా గత ప్రభుత్వం, నాటి అధికారులు వ్యవహరించారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లల్లో కాకినాడ పోర్టులోకి ఒక్క వ్యక్తి కూడా వెళ్లలేదని, ఏ బోట్లు వస్తున్నాయి? ఏమేమి ఎగుమతులు, దిగుమతులు జరిగాయనేది తెలుసుకునేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను కూడా పోర్టు యాజమాన్యం లోపలికి అనుమతించలేదని గుర్తుచేశారు. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం రవాణా జరుగుతుంటే నాటి ప్రజా ప్రతినిధులైన ద్వారపూడి, కన్నబాబులకు తెలియదా? నాడు ఒక్కమాట మాట్లాడని వారంతా పవన్ పర్యటన తర్వాత ఎందుకు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని మంత్రి మనోహర్ నిలదీశారు.

మా నేత మాటలో తప్పేముంది?
దేశ భద్రతకు సంబంధించిన విషయంలోనూ నాటి జగన్ ప్రభుత్వం రాజీ పడిందని, ఇదే రేవు నుంచి ఆయుధాలు, ఉగ్రవాదులు వస్తే పరిస్థితి ఏంటనే.. తన పర్యటనలో జనసేనాని మాట్లాడారని, దానికి కూడా వైసీపీ నేతలు పెడర్ధాలు తీస్తున్నారని మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదివేల ఎకరాల ప్రాంతంలో కేవలం 20 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులున్నారని, ఇలాంటి ఏమాత్రం భద్రత లేని పోర్ట్‌లో గంజాయి, మారణాయిధాలు రావని వైసీపీ నేతలు ఎలా చెబుతారని మంత్రి ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు రంగంలోకి దిగగానే వైసీపీ నేతలంతా భుజాలు తడుముకోవటాన్ని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ప్రజల కోసమే పవన్ తపన..
సముద్రం అల్లకల్లోలంగా ఉందని అధికారులు వారించినా, ప్రజా ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్లి … అక్కడి షిప్‌ను పరిశీలించారని, వ్యవస్థల్లో పేర్కొన్న నిర్లక్ష్యాన్ని వదిలించటమే జనసేనాని లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. దీనికోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇక.. దళారుల ఆట కట్టించి తీరతామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారినైనా తాము ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు.

అమల్లోకి పవన్ ఆదేశం
ఇక.. కాకినాడలో బియ్యం లోడింగ్ కోసం వచ్చిన స్టెల్లా షిప్‌కు నో డ్యూ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు పోర్టు అధికారులు నిరాకరించారు. షిప్‌ను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాన్ని అమలు చేయటంలో ఉన్న చట్టపరమైన అవకాశాలను సివిల్ సప్లై అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, కేవలం కస్టమ్స్‌ విభాగానికి మాత్రమే షిప్‌ను సీజ్ చేసే అధికారం ఉంటుందని, నౌకలో స్మగ్లింగ్ వస్తువులు ఉంటేనే కేసు పెట్టటం కుదురుతుందని, ప్రస్తుత స్మగ్లింగ్ చట్టం కిందకు రేషన్ బియ్యం రాదని పోర్టు అధికారులు అంటున్నారు. కాగా, రేషన్ బియ్యం ఎగుమతి మీద నిషేధం ఉన్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ద్వారా అడ్మిరాలిటీ కోర్టులో కేసు వేయటం ద్వారా పవన్ ఆదేశాన్ని అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ ప్రయత్నిస్తోంది.