Last Updated:

Prime9Special: సెక్యూరిటీ వుండి కూడ ప్రాణాలు కోల్పోయిన దేశాధినేతలు

Prime9Special: సెక్యూరిటీ వుండి కూడ ప్రాణాలు కోల్పోయిన దేశాధినేతలు

Prime9News Desk: ప్రపంచ వ్యాప్తంగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబె మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ప్రభుత్వాధినేతలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పదవిలో లేకున్నా మాజీ ప్రధానులకు కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. అయినప్పటికీ ఎంతో మంది దేశాధినేతలు గతంలో దుండగుల కాల్పులకు బలయ్యారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురైన నేపథ్యంలో.. గతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండి కూడా పలువురు ప్రముఖ నేతలు హత్యకు గురయిన నేతలు ఘటనల వివరాలను పరిశీలిద్దాం..

భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1984, అక్టోబరు 31న ఢిల్లీలోని నివాసం బయట ఉండగా… భద్రతా సిబ్బందిలో సిక్కు మతానికి చెందిన సత్వంత్‌ సింగ్‌, బియాంత్‌ సింగ్‌లు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు.తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 1991, మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో రాజీవ్‌ గాంధీతో పాటు మరికొందరు మృతిచెందారు.

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హత్య జాన్ ఎఫ్ కెనడీది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కెనెడీ… 1963, నవంబరు 22న భార్యతో కలిసి డాలస్‌ మీదుగా ఓపెన్‌ టాప్ కారులో వెళ్తుండగా, లీ హార్వే ఒస్వాల్డ్‌ అనే వ్యక్తి ఆయనపై దారుణంగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన కెనెడీ అరగంట తర్వాత కన్నుమూశారు.బంగ్లాదేశ్‌ అధ్యక్షునిగా పనిచేసిన జియావుర్ రెహమాన్‌ 1981, మే 30న చిట్టగాంగ్‌లోని ప్రభుత్వ నివాసంలో ఉండగా, సైనిక తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఆయనతో పాటు మరో 8 మంది ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న అబ్రహం లింకన్‌ 1865, ఏప్రిల్‌ 14న వాషింగ్టన్‌ డీసీలోని ఫోర్డ్స్‌ థియేటర్‌లో ప్రదర్శనను తిలకిస్తుండగా… జాన్‌ విల్కేస్‌ బూత్‌ అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి తలపై తుపాకీతో కాల్చాడు. గాయపడిన ఆయన మరుసటిరోజు ఉదయం ప్రాణాలు విడిచారు.పాకిస్థాన్‌ తొలి ప్రధాని లియాఖత్‌ అలీ ఖాన్‌ 1951, అక్టోబరు 16న రావల్పిండిలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ గార్డెన్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సమయంలోనే అఫ్గానిస్థాన్‌కు చెందిన సయీద్‌ అక్బర్‌ రెండుసార్లు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో అలీ ఖాన్‌ అక్కడికక్కడే మరణించారు.

శ్రీలంక ప్రధాని బండారు నాయకే 1959, సెప్టెంబరు 25న కొలంబోలోని తన స్వగృహంలో ప్రజలతో సమావేశమయ్యారు. సరిగ్గా అదే సమయంలోనే బౌద్ధ సన్యాసి తాల్దువే సోమరామా థెరో.. బండారనాయకే ఛాతీ, పొత్తికడుపు, చేతిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ బండారనాయకే ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయారు.లుముంబా నాడు కాంగో ప్రధాని. ఆ దేశం నుంచి వేరుపడిన రిపబ్లిక్‌ ఆఫ్‌ కటంగా అధికారులు లుముంబాను , బెల్జియం అధికారుల సమక్షంలో 1961, జనవరి 17న ఉరి తీశారు. ఈ ఘటన ఆ తర్వాత ఆఫ్రికా వ్యాప్త ఉద్యమానికి దారితీసింది.

పాకిస్థాన్‌ అనుకూల బంగ్లాదేశ్‌ సైనిక సిబ్బంది… 1975, ఆగస్టు 15న తమ అధ్యక్షుడు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ నివాసంలోకి చొరబడి, ఆయనతో పాటు భార్య, అయిదుగురు పిల్లలను హతమార్చారు.ఇజ్రాయెల్‌ ప్రధానిగా.. పాలస్తీనాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రాబిన్‌ తీవ్రంగా కృషి చేశారు. ఓస్లో ఒప్పందానికి మద్దతుగా 1995, నవంబరు 4న టెల్‌ అవీవ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా… రాబిన్‌ను ఆల్ట్రానేషనలిస్ట్‌ యిగల్‌ అమీర్‌ కాల్చి చంపాడు.పాకిస్థాన్‌ ప్రధానిగా 2007, డిసెంబరు 27న బెనజీర్ భుట్టో రావల్పిండిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆమెతో పాటు మరో 23 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి: