Population: అత్యధిక జనాభా గల దేశంగా అవతరించిన భారత్
Population:ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. చైనా కంటే 29 లక్షల అధిక జనాభాతో భారత్ ఈ రికార్డు సాధించినట్టు ప్రకటించింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత్ లో 142.86 కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
1950 తర్వాత తొలిసారి(Population)
1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాను విడుదల చేస్తోంది. అప్పటి నుంచి ఈ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023’ పేరుతో తాజా నివేదిక విడుదల అయింది. ఈ జాబితాలో ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారంతో ఈ అంచనాలు లెక్కకట్టినట్టు పేర్కొంది. అయితే ఈ జనాభా గణాంకాలపై భారత్ నుంచి అధికారంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రతీ పదేళ్లకు ఒకసారి భారత్ లో జనాభా లెక్కల ప్రక్రియను చేపడతారు. ఈ క్రమంలో 2011 తర్వాత తిరిగి 2021 లో జనాభా లెక్కలు చేపట్టాలి. కానీ కోవిడ్ కారణంగా జనాభా గణాంకాలు వాయిదా పడ్డాయి.
చైనాలో భారీగా తగ్గుదల
మరోవైపు 2022 నుంచి చైనా జనాభా పెరుగుదలలో గజనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 1960 తర్వాత ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే. అయితే దీనికి కారణం అక్కడి పరిస్థితులు, చట్టాలు కారణం అయ్యాయి. జనాభా పెరుగుదల రేటను పెంచేందుకు అక్కడ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయొ. 2022 లో దాదాపు 8,50,000 జనాభా తగ్గడం గమనార్హం. భారత్, చైనా తర్వాత అమెరికా, ఇండోనేషియా, పాకిస్థాన్ లు ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వయసుల వారీగా
భారత్ జనాభాలో గ్రూప్ శాతాన్ని కూడా వెల్లడించింది. భారత జనాభాలో 0 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 25 శాతం, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారు 18 శాతం, 10 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 26 శాతం ఉన్నారని తెలిపింది. ఇండియాలో 15 నుంచి 64 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లు 68 శాతం మంది ఉన్నారని, 65 సంవత్సరాలకు పైబడిన వారు జనాభాలో 7 శాతంగా ఉన్నారని పేర్కొంది. మరో వైపు చైనా జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 20 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ పేర్కొంది.