Last Updated:

Gaza: గాజాలో భీకర దాడులు.. హమాస్‌కు వ్యతిరేకంగా నిరసనలు

Gaza: గాజాలో భీకర దాడులు.. హమాస్‌కు వ్యతిరేకంగా నిరసనలు

Gazans chant anti Hamas slogans: గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా వేలమంది పాలస్తీనియన్లు చనిపోయారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అనేకమంది పలు శిబిరాల్లో తలదాచుకున్నారు. తాజాగా, గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా వేలాది మంది పాలస్తీనియన్లు నిరసన చేపట్టారు.

 

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ముగింపు పలకాలని, అధికారం నుంచి దిగిపోవాలని హమాస్‌ను డిమాండ్ చేస్తున్నారు. ‘హమాస్ టెర్రరిస్ట్స్ ఔట్’, ‘యుద్ధం ముగించండి’, ‘మాకు ప్రశాంత జీవనం’ కావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల రెండు నెలల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ వరుస బాంబు దాడులు చేశాయి. ఈ దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.

 

కాగా, 2007 నుంచి గాజాలో హమాస్ పరిపాలన సాగిస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత కొంతకాలంగా యుద్ధం జరుగుతుండగా.. వేలాదిమంది పాలస్తీనియన్లు చనిపోయారు. అయితే ఈ యుద్ధం మొదలైనప్పటినుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూనే ఉంది. ఇటీవల మొదటిదశ కాల్పుల విరమణ పొడగింపుపై హమాస్ నిరాకరణ వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే టెల్ అవీవ్ తన దాడులను కొనసాగించింది.

 

ఈ మేరకు మిలిటెంట్ సంస్థపై పాలస్తీనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, నార్త్ గాజాలోని బీట్ లాహియాతో పాటు ఇతర ప్రాంతాల్లో పాలస్తీనియన్లు ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాజాలో నివసిస్తున్న ప్రజలను కాపాడేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకునేందుకు సాహసం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.