Last Updated:

London Airport : లండన్‌కు రాకపోకలు షురూ.. విమాన సర్వీసులు పునఃప్రారంభం

London Airport : లండన్‌కు రాకపోకలు షురూ.. విమాన సర్వీసులు పునఃప్రారంభం

London Airport : ఓ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో లండన్‌లోని హీత్రో విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు మెరుగుపడటంతో ఫైట్ సర్వీసులను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా హీత్రో విమానాశ్రయానికి రాకపోకలను పునఃప్రారంభించినట్లు ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు వర్జిన్‌ అట్లాంటిక్‌, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లు కూడా షెడ్యూల్‌ ప్రకారం సర్వీసులు నడిపించినట్లు తెలిపాయి.

 

 

ఎయిరిండియా విమానం ఏఐ111తోపాటు లండన్‌కు రాకపోకలు సాగించే అన్ని విమానాలు షెడ్యూల్‌ ప్రకారం నడుస్తున్నాయని ఎయిరిండియా వెల్లడించింది. దీంతోపాటు ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించిన ఏఐ161 కూడా అక్కడి నుంచి బయలు దేరుతుందని తెలిపింది. ఢిల్లీ నుంచి లండన్‌కు ఎయిరిండియా ప్రతిరోజూ 6 విమాన సర్వీసులు నడిపిస్తోంది.

 

 

భారత్ నుంచి బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ మొత్తం 8 విమానాలు లండన్‌కు నడిపిస్తుండగా, ఇందులో 3 ముంబయి, రెండు ఢిల్లీ నుంచి సేవలందిస్తున్నాయి. మిగతావి ఇతర ప్రాంతాల నుంచి ఉన్నాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌ కూడా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి మొత్తం 5 సర్వీసులు నడిపిస్తోంది. హీత్రోలో నెలకొన్న పరిస్థితులతో సాధ్యమైనన్ని ఎక్కువ సర్వీసులను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ క్రమంలో కొంత ఆలస్యం కావచ్చని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది.

 

 

ప్రయాణికులకు అసౌకర్యం..
హీత్రో విమానాశ్రయానికి విద్యుత్‌ అంతరాయం ఏర్పడడంతో వందలాది ఫైట్ సర్వీసులు రద్దయ్యాయి. దీంతో 2లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడినట్లు అంచనా. 4వేల టన్నుల కార్గో రవాణా నిలిచిపోయింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావొద్దని, రీషెడ్యూల్‌ కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. విమాన సర్వీసులు పునరుద్ధరించినప్పటికీ సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: