Identity Telugu Release: తెలుగులోకి మలయాళం బ్లాక్‌బస్టర్‌గా త్రిష ‘ఐడెంటిటీ’ మూవీ – రిలీజ్ ఎప్పుడంటే!
Trisha Identity Telugu Version Release Date: హీరోయిన్ త్రిష రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. పాన్ ఇండియా, భారీ బడ్జెట్, అగ్ర హీరోల సినిమాల్లో లీడ్ రోల్ పాత్రలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన త్రిషను ఆఫర్స్ వెతుక్కుంటు వచ్చాయి. అప్పటి వరకు పెద్దగా ఆఫర్స్ లేని ఆమె పొన్నియిన్ సెల్వన్ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తోంది.
అలాగే అజిత్‌తో ‘విడాముయార్చి’, గుడ్బ్యాడ్ అగ్లీలో హీరోయిన్గా చేస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న త్రిష మలయాళంలో ఓ సినిమా చేసింది. అదే ఐడెంటిటీ. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టోవినో థామస్ సరసన నటించింది. అలాగే మందిరా బేడీ ఇందులో కీలక పాత్ర పోషించింది. ఇందులో త్రిష యాక్షన్ సీన్స్‌లోనూ నటించి అదరగొట్టింది. ఎన్నో అంచనాల మధ్య మలయాళంలో ఈ ఏడాది జనవరి 2న రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రెండు వారాల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి మాలీవుడ్‌కు కొత్త సంవత్సరంలో శుభారాంభాన్ని ఇచ్చింది.
2025లో ఇండస్ట్రీకి తొలి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర చింతపల్లి రామారావు కలిసి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతోంది. తాజాగా దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా చాలా గ్యాప్ తర్వాత త్రిష డబ్బింగ్ చిత్రంతో వస్తుండటంతో ఆమె అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాను దర్శక ద్వయం అఖిల్ బాయ్, అనాస్ ఖాన్లు రూపొదించారు.