The Smile Man Review: ముఖంపై స్మైల్ చెక్కే సైకో.. చెమటలు పట్టించే థ్రిల్లర్ చిత్రం

The Smile Man Review: ఈ మధ్యకాలంలో క్రైమ్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఏ భాషలో రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు వాటిని హిట్ చేస్తున్నారు. కేవలం థియేటర్ లోనే కాదు ఓటీటీలో కూడా చూస్తున్నారు. ఇప్పటికే సోనీ లివ్ లో రేఖాచిత్రం అనే సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా మరో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కూడా మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమానే ది స్మైల్ మ్యాన్.
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ 150 వ చిత్రంగా ది స్మైల్ మ్యాన్ తెరకెక్కింది. శ్యామ్ ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాదిలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో ఆహా ఓటీటీలో ప్రత్యేక్షమయ్యింది. ది స్మైల్ మ్యాన్ సినిమాలో శ్రీ కుమార్, సిజా రోజ్, ఇనేయ, కలైయరసన్, జార్జ్ మేరియన్, సురేష్ చంద్ర మీనన్, రాజ్ కుమార్, కుమార్ నటరాజన్, బేబీ అజియా తదితరులు నటించారు.
ది స్మైల్ మ్యాన్ కథ విషయానికొస్తే.. చిదంబరం (శరత్ కుమార్) ఒక రిటైర్డ్ సీబీ- సీఐడీ. అతనికి అల్జీమర్స్ ఉంటుంది. గతం తాలూకు జ్ఞాపకాలు పూర్తిగా ఒక ఏడాదిలో చెరిగిపోతాయని డాక్టర్ చెప్తుంది. దీంతో చిదంబరం తాను ఛేదించిన కేసుల వివరాలను ఒక బుక్ లో రాసి పబ్లిష్ చేస్తాడు. ఆ బుక్ లో ది స్మైల్ మ్యాన్ కేసు మాత్రం అసంపూర్తిగా ఉంటుంది. ఆ బుక్ పబ్లిష్ అయిన తరువాత సేమ్ ప్యాట్రన్ లో స్మైల్ మర్డర్ జరుగుతుంది.
గతంలో చిదంబరం ఆ కేసు కోసం వర్క్ చేసి ఉండడంతో ప్రస్తుత సీబీ- సీఐడీ అధికారులు అతని సహాయం కోరతారు. దీంతో తాను గతం మర్చిపోయేలోపు స్మైల్ మ్యాన్ ను పట్టుకోవాలని చిదంబరం ఏం చేశాడు..? అసలు చిదంబరంకు , స్మైల్ మ్యాన్ కు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి.. ? ముఖంపై స్మైల్ చెక్కి హత్యలు చేస్తున్న సైకో ఎవరు.. ? ఎందుకు అలా చేశాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
రచ్చసన్, పోర్ తొజిల్ లాంటి సినిమాలు చూసినప్పుడు ఒక మనిషి సైకోగా మారడం వెనుక ఎంతో బాధ ఉంటుంది. సమాజం వారిని చిన్నచూపు చూడడం, ఎగతాళి చేయడం లాంటివి చూసి సహించలేక.. హత్యలు చేసి వారి కసిని తీర్చుకుంటూ ఉంటారు. ఇందులో కూడా విలన్ అలాంటి కేటగిరికి చెందినవాడే అయినా అతని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
అల్జీమర్స్ తో బాధపడే ఒక అధికారి.. తన జీవితంలో ఎంతో దగ్గరైన వ్యక్తిని పోగొట్టుకుంటే.. ఆబాధ అతనిని వెంటాడుతూ ఉంటుంది. జ్ఞాపకాలు అన్ని మరిచిపోయినా.. అది మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో కూడా దైర్యంగా నిలబడి హంతకుడును కనిపెట్టిన తీరు బావుంది. ఇక మ్యూజిక్.. థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడు అదే పెద్ద హైలైట్. గవాస్కర్ అవినాష్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్.. కొన్నిసార్లు చెమటలు పట్టిస్తుంది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మీద కూడా ఓ లుక్ వేసేయండి.