Court – State Vs A Nobody Trailer: కోర్ట్ ట్రైలర్.. ఫోక్సో చట్టం కింద కేసు పెడితే..

Court – State Vs A Nobody Trailer: న్యాచురల్ స్టార్ నాని మంచి మంచి కథలను ఎంచుకొని హీరోగా చేయడమే కాదు.. నిర్మాతగా కూడా మంచి కథలను ప్రేక్షకులకు అందించడం మొదలుపెట్టాడు. వాల్ సినిమా పోస్టర్స్ బ్యానర్ స్థాపించి అందులో చిన్న చిన్న కథలను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా నాని నిర్మిస్తున్న చిత్రం కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఎన్నో కోర్ట్ డ్రామాలు వచ్చాయి. కానీ, ఈ కోర్ట్ డ్రామా మాత్రం చాలా కొత్తగా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలో ఫోక్సో చట్టం ఎంత పవర్ ఫుల్ గా ఉందో అందరికీ తెల్సిందే. కానీ, ఆ చట్టాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తూ అమాయకులను కూడా నిందితులుగా మారుస్తున్నారు. కోర్ట్ లో కూడా ఇదే చూపించారు.
హార్ష్ రోషన్, శ్రీదేవి ఇద్దరు టీనేజర్స్ ప్రేమించుకుంటారు. హార్ష్ పేదింటి అబ్బాయి. వీరి ప్రేమ విషయం తెల్సిన శ్రీదేవి తండ్రి శివాజీ.. అబ్బాయిపై లేనిపోని కేసులు పెడతాడు. అమ్మాయిని వేధించాడని, బెదిరించాడని.. ఫోక్సో కేసు వేయడంతో హార్ష్ ను అరెస్ట్ చేస్తారు. బెయిల్ రానివ్వకుండా 78 రోజులు జైల్లోనే కొడుతూ ఉంటారు. ఇక అబ్బాయి తల్లిదండ్రులు లాయర్ అయిన సాయి కుమార్, ప్రియదర్శిల వద్దకు రావడంతో వారు ఈ కేసును ఒప్పుకొని వాదిస్తారు.
అయితే మధ్యలో సాయి కుమార్ ఇది ఫోక్సో కేసు.. అబ్బాయి బయటకు రాడు అని చెప్పి కేసు వదిలేయమంటే ప్రియదర్శి తాను ఒక్కడే కేసు వాదిస్తానని, అబ్బాయిని కాపాడతానని చెప్పుకొస్తాడు. మరి చివరకు హార్ష్ ను ప్రియదర్శి కాపాడాడా.. ? అమ్మాయి సాక్ష్యం చెప్పినా అబ్బాయికే శిక్ష పడేంత కఠినమైన చట్టం ఏంటిది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కూతురును కులం తక్కువ అబ్బాయి ప్రేమించాడని.. ఒక తండ్రి చేసిన దారుణమే ఈ సినిమా అని తెలుస్తోంది. లాయర్ గా ప్రియదర్శి.. లవర్ గా హార్ష్ నటనకు మంచి ప్రశంసలు దక్కనున్నట్లు కనిపిస్తుంది. మార్చి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాని.. నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.