Saif Ali Khan: రక్తం కారుతున్నా.. సింహంలా నడుచుకుంటూ వచ్చారు – సైఫ్ రియల్ హీరో: లీలావది వైద్యులు
Hospital Doctors Praises Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ నటుడు సైప్ అలీఖాన్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దొంగతనం కోసం ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు. గాయపడ్డ సైఫ్ ప్రస్తుతం ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేసిన వైద్యులు సైఫ్ రియల్ హీరో అని కొనియాడారు. అంతేకాదు ఆయనపై పడిన కత్తి పోట్లు చాలా ప్రమాదకరమైనవి, ఇంకా లోతుకి దిగి ఉంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం అయ్యేదన్నారు. వైద్యులు మాట్లాడుతూ.. “ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఆయన మెల్లిగా కోలుకుంటున్నారు. వెన్నుముకలో కత్తి దిగడంతో పెరాలసిస్ రిస్క్ ఉంటుందేమోనిన భయపడుతున్నారు. ఎలాంటి భయాలు వద్దు. ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు షిఫ్ట్ చేశాం.
అయితే వారం వరకు ఆయనను ఎవరూ కలవకూడదు. వెన్నుముకు గాయం కారణంగా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎవరిని లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. సైఫ్ ఆరోగ్యం బాగానే ఉంది. మెల్లిమెల్లిగా నడుస్తున్నారు. అయితే ఆయన అదృష్టవంతుడనే చెప్పాలి. వెన్నులోకి దిగిన కత్తి మరో 2 మిల్లీమీటర్లు లోపలికి వెళ్లి ఉంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది. అదే జరిగి ఉంటే ఆయనను కాపాడం కష్టమయ్యేది. ఆసత్రికి వచ్చినప్పుడు సైఫ్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉన్నారు. కానీ సింహంలా నడుచుకుంటూ వచ్చారు. స్ట్రేచర్ కూడా వాడలేదు. ఆయన రియల్ హీరో” అని వైద్యులు అన్నారు.
కాగా గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి అక్రమంగా సైప్ ఇంట్లో చొరబడ్డాడు. ఈ క్రమంలో సైఫ్ కుమారుడి కేర్ టేకర్ అతడి చూసి కేకలు పెట్టింది. ఆ చప్పుడుతో లేచిన సైఫ్ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో దుండగుడు సైఫ్‌పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆయన ఒంటిపై ఆరు చోట్లు కత్తి పోట్లు పడ్డాయి. అలా రక్తమోడుతున్న సైఫ్‌ని ఇంట్లో కారు సిద్ధంగా లేకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకవెళ్లారు. ఇదిలా ఉంటే ఆయనపై దాడి చేసిన వ్యక్తిని కాసేపటి క్రితం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాంద్రాలోని ప్రాంతంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.