Last Updated:

Stock Market: వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. రూపాయి 22 పైసలు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కాగా.. గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగ తగిలింది.

Stock Market: వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. రూపాయి 22 పైసలు పతనం

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కాగా.. గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగ తగిలింది. స్థిరాస్తి, విద్యుత్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువలా సాగాయి. మరోవైపు గురువారం వచ్చిన పలు కంపెనీల మార్చి త్రైమాసిక ఫలితాలు కూడా మదుపర్లను నిరాశపర్చాయి. సూచీల్లో ప్రాధాన్య వెయిటేజీ ఉన్న ఎస్‌బీఐ, ఐటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత సూచీలు మరింత కిందకు వెళ్లాయి.

 

లాభాలతో ప్రారంభమై(Stock Market)

ఉదయం సెన్సెక్స్‌ 61,937.86 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,349.34 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 128.90 పాయింట్ల నష్టంతో 61,431.74 దగ్గర స్థిరపడింది.

నిఫ్టీ ఉదయం 18,287.50 దగ్గర ప్రారంభమై.. ఇంట్రాడేలో 18,104.85 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 51.80 పాయింట్లు నష్టపోయి 18,129.95 దగ్గర నిఫ్టీ ముగిసింది. మార్కెట్లు ముగిసేసరికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 82.59 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో ,హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, ఐటీసీ, టైటన్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్‌ షేర్లు ఉన్నాయి.

 

అంచనాలను అందుకోలేక..

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను తాకలేకపోయాయి. దీంతో స్టాక్‌ విలువ ఈ రోజు 2.05 శాతం నష్టపోయి రూ. 418.85 దగ్గర స్థిరపడింది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 7 శాతం పుంజుకొని రూ. 19,058 కోట్లకు చేరింది. నికర లాభం 23 శాతం పెరిగి రూ. 5,175 కోట్ల పైకి వెళ్లింది.

ఎస్‌బీఐ షేరు గురువారం 1.70 శాతం నష్టపోయి రూ. 576.35 వద్ద ముగిసింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బ్యాంకు గురువారం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 83 శాతం పెరిగి రూ. 16,694.51 కు చేరింది.