PM Modi : సునీతా విలియమ్స్‌కు లేఖ రాసిన ప్రధాని మోదీ.. భారత్‌కు రావాలంటూ ఆహ్వానం

PM Modi : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. భారత్‌ను సందర్శించాలని ఆయన ఆ లేఖలో సునీతాను కోరారు. సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా ఇవాళ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి తిరుగు ప్రయాణమైంది. ఆస్ట్రోనాట్ సునీతాతో పాటు విల్మోర్ మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమి మీదకు వస్తున్నారు.
మార్చి 1వ తేదీన సునీతకు ప్రధాని మోదీ లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గతేడాది జూన్ నుంచి స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ క్షేమం గురించి అమెరికా పర్యటనలో అడిగి తెలుసుకున్నట్లు లేఖలో ప్రధాని పేర్కొన్నారు. వేల మైళ్ల దూరంలో ఉన్నా నువ్వు తమ గుండెలకు దగ్గరగా ఉన్నట్లు ఆ లేఖలో తెలిపారు. నీ ఆరోగ్యం కోసం భారతీయులు ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. నువ్వు చేపట్టిన మిషన్‌లో కూడా విజయవంతం కావాలని భావిస్తున్నట్లు చెప్పారు.
సునీతా సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని, తమ లేఖ 140 కోట్ల భారతీయుల మనోగతాన్ని వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు. ఆస్ట్రోనాట్ మైక్ మాసిమినో ద్వారా ఆ లేఖను పంపారు. సునీతాకు మద్దతు ప్రకటిస్తూ ఆమె పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సురక్షితంగా తిరిగి రావాలని, దేశం సునీతాకు అండగా ఉంటుందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బైడెన్‌ను కలిసినప్పుడు సునీత ఆరోగ్యం, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నట్లు లేఖలో ప్రధాని మోదీ తెలిపారు.