Karnataka : డ్రగ్స్ స్మగ్లింగ్‌లో విదేశీ మహిళల అరెస్టు

Karnataka : దేశంలో రోజురోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. దీంతో యువత డ్రగ్స్‌కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. కొందరు డబ్బుల ఆశకు డ్రగ్స్ వ్యాపారానికి పాల్పపడుతున్నారు. దేశంలో ఎక్కడో ఓ చోట రోజు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా భారీగా డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ మేరకు డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు విదేశీ మహిళలు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పట్టుబడిన మహిళలు నైజీరియాకు చెందిన బాంబా ఫాంటా (31), అబిగైల్ అడోనిస్ (30)గా గుర్తించారు. ఢిల్లీ నుంచి ఎండీఎంఏను ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తుండగా, అదుపులోకి తీసుకున్నట్లు మంగళూరు సీపీ అనుపమ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. వీరి నుంచి ఫోన్లు, పాస్‌పోర్టులతోపాటు రూ.18వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
వీరు ఢిల్లీలో నివాసం ఉంటూ దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ డ్రగ్స్‌ను పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారని, ఏడాది కాలంలో ముంబయికి 37 సార్లు, బెంగళూరుకు 22సార్లు విమాన ప్రయాణాలు చేసినట్లు పోలీసులు వివరించారు. 2020లో ఫాంటా అనే మహిళ బిజినెస్ వీసాపై ఇండియాకు రాగా, 2016 నుంచి అడోనిస్ ఇండియాలో ఉంటున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా వీరు డ్రగ్స్ ముఠాలో భాగస్వాములయ్యారని అగర్వాల్ తెలిపారు.
ఆరు నెలల క్రితం మంగళూరులో 15 గ్రాముల ఎమ్‌డీఎంఏతో హైదర్ అలీ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందుకు బెంగళూరులో మరో వ్యక్తి ఆరు కిలోల ఎమ్‌డీఎంఏతో అధికారుల చేతికి చిక్కాడు. దీనిలో భాగమైన మిగిలిన వారిని కూడా గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు.