Delhi Election Results 2025: అధికార దాహమే ఓటమికి కారణం.. అన్నా హజారే షాకింగ్ కామెంట్స్
Anna Hazare Shocking comments on Kejriwal about Delhi Election Results 2025: దేశవ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవ్వగా.. బీజేపీ మొదటి నుంచి జోరు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆప్ 26 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ముందంజలో కనిపించడం లేదు.
అయితే, ఓటమి దిశగా సాగుతున్న ఆప్‌పై సామాజిక వేత్త అన్న హాజరే మీడియాతో మాట్లాడారు. అవినీతి దాహమే ఆప్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అవినీతిలో మునిగిపోయిన కేజ్రీవాల్‌ని ఢిల్లీ ప్రజలు ఓడించారన్నారు. మరోవైపు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్.. అరవింద్ కేజ్రీవాల్ ఫలితాలపై ప్రభావం పడిందన్నారు. ఆప్ ఓటమికి లిక్కర్ కుంభకోణమే కారణమని అన్నారు. రాజకీయాల్లో పోటీలో నిల్చునే అభ్యర్థిపై ఎలాంటి ఆరోపణలు, నిందలు ఉండకూడదని అన్నారు. ఇదే విషయాన్ని చాలాసార్లు కేజ్రీవాల్‌తో కూడ చెప్పానని, అయితే ఆ మాట వినలేదని విమర్శించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ డబ్బు, అధికారంపైనే ఫోకస్ చేస్తున్నారని, అందుకే అతను ఇమేజ్ పూర్తిగా దెబ్బందిందని విమర్శలు గుప్పించారు.