Last Updated:

Delhi Election Results 2025: హస్తినలో కమల వికాసం.. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో పాగా

Delhi Election Results 2025: హస్తినలో కమల వికాసం.. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో పాగా

Delhi Election Results 2025 out BJP makes a comeback after 27 years: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు గానూ 48 స్థానాల్లో గెలిచి సత్తా చాటి.. వరుసగా మూడుసార్లు ఢిల్లీలో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించింది. శనివారం ఎన్నికల ఫలితాల్లో ఆదినుంచి ఆధిక్యాన్ని చాటుతూ సాగిన బీజేపీ అభ్యర్థుల చేతిలో ఆప్ తరపున బరిలో దిగిన మాజీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా వంటి కాకలు తీరిన నేతలంతా మట్టికరిచారు. గతంలో పదిహేనేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారీ ఖాతాను తెరవలేక చతికిల పడింది. వెరసి.. 27 ఏళ్ల తర్వాత దక్కిన ఈ అపురూప విజయంతో కమలం పార్టీ కార్యకర్తలు, నేతలు సంతోషంలో మునిగిపోయారు.

ఇవీ ఫలితాలు..
ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు గానూ బీజేపీ 68 సీట్లలో పోటీచేయగా, రెండు స్థానాలను జేడీయూ, లోక్ జనశక్తి పార్టీకి చెరొకటి కేటాయించింది. ఈ ఫలితాల్లో ఈ కూటమి 48 సీట్లు సాధించింది. కాగా, మొత్తం 70 స్థానాలకు తన అభ్యర్థులను నిలిపిన ఆప్.. 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ గతం మాదిరిగానే సున్నా సీట్లకు పరిమితమైంది.

అన్నా శిష్యుడిగా మొదలై.. సీఎం వరకు
అరవింద్ కేజ్రీవాల్.. పుష్కరకాలం నాడు అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకురావాలని గాంధేయవాది అన్నా హజారే చేసిన దీక్షతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించారు. ఆ ఉద్యమ ఫలితంగా నాటి యూపీఏ సర్కారు జనలోక్‌పాల్ బిల్లును తీసుకురావాల్సి వచ్చింది. ఆ ఉద్యమం తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న తన ఆకాంక్షను అన్నా హజారేతో కేజ్రీవాల్ వ్యక్త పరచగా, ఆయన నిరాకరించారు. పౌర సమాజంలో మార్పులు తెస్తూ.. సమాజానికి టార్చ్ బేరర్‌గా ఉండాలని సూచించారు. కానీ, గురువుగా చెప్పే అన్నా హజారే మాటను కాదని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి.. వరుసగా మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు.

అవినీతిలో మునిగి..
పలు రాష్ట్రాలకు చెందిన మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశ రాజధాని ఢిల్లీలో నాటి పరిస్థితులను మార్చి అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పిన కేజ్రీవాల్ మాటను నమ్మిన జనం మూడుసార్లు వరుసగా ఆయనకు అవకాశమిచ్చారు. కానీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ జాతీయ కన్వీనర్ పూర్తిగా విఫలమయ్యారు. అవినీతిని నిర్మూలిస్తారని జనం అనుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు పాల్పడి, అదే ఆరోపణలతో సీఎం కుర్చీ పోగొట్టుకుని, జైలుపాలై పరువు పోగొట్టుకున్నారు. కేజ్రీవాల్‌తో పాటు ఆప్ ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా కటకటాల పాలవటం, ఏ సౌకర్యాలు కోరనని చెప్పి గద్దెనెక్కిన కేజ్రీ.. ఏకంగా రూ. 33 కోట్లతో ఢిల్లీలో సకల సౌకర్యాలతో శీష్ మహల్(అద్దాల మేడ)ను తన అధికారిక నివాసంగా మార్చుకోవటాన్ని ఢిల్లీ ప్రజలు తట్టుకోలేకపోయారు.

విఫలమైన జాతీయ పార్టీ వ్యూహం..
ఢిల్లీ కేంద్రంగా పురుడుపోసుకున్న ఆప్ పార్టీని జాతీయ పార్టీగా విస్తరించే యోచనతో ఢిల్లీ పాలనను, అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలికొదిలేసి.. మోదీకి వ్యతిరేకంగా దేశమంతా తిరిగి మద్దతును కూడగట్టే పనిలో తర్వాతి రోజుల్లో కేజ్రీ పడిపోవటమూ ఢిల్లీ వాసులకు నచ్చలేదు. అయినా.. అవేమీ పట్టించుకోకుండా, ఉచితాల పేరుతో పేద, దిగువ మధ్యతరగతిని భ్రమలో ఉంచుతూనే.. పంజాబ్‌లో ఆప్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఈ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేసి హవాను కొనసాగించారు. కామన్‌ మ్యాన్‌కి ప్రతినిధినంటూ బీజేపీకి కంటిలో నలుసులా మారారు. ఆనక.. జైలు పాలై, అతిశీని పీఠమెక్కించి ఈ ఎన్నికల్లో గెలిచి, మరోసారి చక్రంతిప్పుదామని ప్రయత్నించారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి రాకపోగా, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవటంతో ఇంటి బాట పట్టారు.

ఐదేళ్లలో తలకిందులైన తీరు..
2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి ఏకంగా 62 స్థానాలు లభించగా, బీజేపీ మాత్రం 8 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఐదేళ్లలో మద్యం కేసులో కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు, పలువురు ఉన్నతాధికారులు ఇరుక్కోవడం, ఢిల్లీ కాలుష్యం, యమునా నదిని క్లీన్ చేసే విషయంలో మాట నిలబెట్టుకోలేకపోవడం ఆప్ పాలిట శాపాలుగా మారాయి. అదే సమయంలో పార్టీలోని కీలక నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీలో లుకలుకలు, సీఎంగా వచ్చిన అతిశి అత్యుత్సాహం, ఆప్ పార్టీని కొంపముంచాయి.

డబుల్ ఇంజన్‌ నినాదంతో బీజేపీ
షీలా దీక్షిత్ హయాంలో కాంగ్రెస్ హవా సాగుతున్న నాటి నుంచి బీజీపీ ప్రతి ఎన్నికల్లోనూ పాగావేయాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతూ వచ్చింది. అసెంబ్లీకి కాంగ్రెస్, ఆప్‌ పార్టీలకు పట్టం కట్టిన ఢిల్లీ ప్రజలు.. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీకే గత పదిహేనేళ్లుగా పట్టం కడుతూ రావటం ఆ పార్టీకి ఆక్సిజన్‌ను అందించిన పరిణామంగా వస్తోంది. అదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ బీజేపీ తన పట్టును నిలుపుకుంటూనే వచ్చింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ అవినీతిని జనంలోకి తీసుకుపోవటం, కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ అవినీతిని నిరూపించగలగటం బీజేపీకి ప్లస్ పాయింట్లుగా మారాయి. అదే సమయంలో.. ఈ ఎన్నికల్లో ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీ, స్థానిక ఆరెస్స్‌స్ కార్యకర్తలు ఒక్కటై ఇంటింటి ప్రచారం నిర్వహించటం, ఢిల్లీయేతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లను కలిసి వారి మద్దతును కూడగట్టటం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం నినాదం వర్కవుట్ కావటంతో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అఖండ విజయానికి కారణమయ్యాయి.

మూడోసారి శూన్య హస్తమే..
ఈ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్.. 2015,2020 ఎన్నికల ఫలితాలను గుర్తుచేస్తూ ఈసారీ సున్నా సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలు సుడిగాలి ప్రచారం నిర్వహించినా అదే ఫలితం పునరావృతమైంది. ఈసారి ఢిల్లీ సీఎం అతిశీపై పోటీకి దిగిన అల్కా లాంబా, కేజ్రీ మీద పోటీకి దిగిన షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా ఘోరంగా ఓడిపోయారు. 1952 నుంచి 2020 మధ్య 8 సార్లు ఎన్నికలు జరిగితే 4సార్లు గెలిచిన కాంగ్రెస్ .. వరుసగా మూడోసారి సున్నాకే పరిమితం కావటంతో హస్తం శ్రేణులన్నీ షాక్‌కు గురయ్యాయి. అయితే, గత ఎన్నికల్లో 4 శాతం ఓట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్.. ఈసారి 17 శాతం ఓట్లు సాధించగలిగింది. అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు.. బీజేపీ కంటే ఆప్‌నే ప్రధానశత్రువుగా భావించటంతో అనేకచోట్ల ఆప్ అభ్యర్థులు కొద్ది మెజారిటీలతో ఓడిపోవాల్సి వచ్చింది.

సచివాలయం సీజ్..
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి ఫైల్స్, డాకుమెంట్స్, కంప్యూటర్ హార్డ్ వేర్ లాంటివి ఢిల్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నుంచి బయటికి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఒకవేళ అత్యవసరమైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో సెక్రటేరియట్‌కు చెందిన అన్ని విభాగాల అధిపతులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంటూ ఢిల్లీ గవర్నర్ కార్యాలయం నుంచి నోటీసు జారీ అయింది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ పేర్కొన్న నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది.

పర్వేష్‌కే సీఎం సీటు
ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ మీద బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన పర్వేష్ వర్మకే ఈసారి ఢిల్లీ సీఎంగా బీజేపీ అవకాశం ఇవ్వనుందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవటం ఈ వార్తకు బలం చేకూర్చుతోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సాబిబ్ సింగ్ వర్మ. పర్వేష్ తండ్రి 1996 ఫిబ్రవరి 26 నుంచి 1998 అక్టోబర్ 12 వరకు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. జాట్ వర్గానికి చెందిన పర్వేష్..ఎంబీఏ చేసి 2013లో రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ తరపున 2013 నుంచి 2014 మధ్య మెహ్రౌలి నియోజకవర్గం నుంచి గెలిచి ఢిల్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తర్వాతి ఏడాది పశ్చిమ ఢిల్లీ సీటు నుంచి 2.68 వేల పైచిలుకు ఓట్లతో గెలిచి రికార్డు మెజార్టీతో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఓటమనేదే ఎరుగకుండా తన రికార్డును తానే బద్దలు కొడుతూ 2019,2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు.