Raghunandan Rao: మతి లేని మాటలొద్దు.. కాంగ్రెస్, బీజేపీ కలిసింటే నువ్వు జైల్లో ఉండేవాడివి
BJP MP Raghunandan Rao Warning To KTR: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కలిగిస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. విపక్షంలోకి వచ్చాక నీతి మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ అధికారంలో ఉండగా చేసిన పనులు ఓసారి గుర్తుచేసుకోవాలని ఎద్దేవా చేశారు.
మేం కలిస్తే..
ఇటీవల కాలంలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయాయని కేటీఆర్ పదేపదే మాట్లాడుతున్నారని రఘునందన్ మండిపడ్డారు. నిజంగానే తాము కాంగ్రెస్ పార్టీతో పని చేసి ఉంటే ఈపాటికి కేటీఆర్ చర్లపల్లి జైలు చిప్పకూడు తినేవారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆయనకు మతిపోయిందనిపిస్తోందని సెటైర్ వేశారు.
పదేళ్ల దుర్మార్గం
తమ హయాంలో కేటీఆర్ అన్ని శాఖల మీద పెత్తనం చేసి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారని రఘునందన్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను కేటీఆర్ చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల గురించి నీతులు చెబితే.. తాము వినాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎలా చేయాలో, ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో కేటీఆర్‌కు తెలిసి ఉండుంటే.. ఆయనకు విపక్షంలో కూర్చోవాల్సి వచ్చే దుస్థితి పట్టేది కాదన్నారు.
బీజేపీ ట్వీట్
ఇదిలా ఉండగా, టీ బీజేపీ గురువారం ఆసక్తికర కామెంట్ చేసింది. కారు స్టీరింగ్ చేతిలో ఉందని అందరికీ తెలుస్తూనే ఉందని, ఆ రెండు పార్టీల ఆటల్ని కట్టించేది బీజేపీయేనని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2024 కు ముందు, 2024 కు తర్వాత అని ఆసక్తికర ఫోటోను పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు పక్కదోవ పట్టినట్లుగానే కాంగ్రెస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి కేసులన్నీ పక్కదోవ పట్టాయని ప్రస్తావించింది.