Telangana: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో ఎన్నికలకు నోటిఫికేషన్?
Telangana Panchayat Election Notification Schedule: పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది. జనవరి 14న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉన్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయనున్నది. ఆ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు పెట్టనుంది.
కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు..
రాష్ర్టంలో పంచాయతీ ఎన్నికలు 2025 కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో కుల గణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చెప్పారు. దీనికి అనుగుణంగానే కుల గణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులపై సీఎం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కుల గణనపై సమాచారాన్ని కూడా తెప్పించుకున్నారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చేపట్టిన కుల గణనపై అధ్యయనం చేశారు.
15 రోజుల ముందుగా షెడ్యూల్..
డిసెంబరు, జనవరి మొదటి వారంలో కుల గణన పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలకు 15 రోజుల ముందుగా షెడ్యూల్ వెలువడుతుంది. ఈ లెక్కన జనవరి నెల చివరి వరకు తెలంగాణలోని 12,769 పంచాయతీలకు ఎన్నికలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే.. కాంగ్రెస్ కు ప్రజల నుంచి సానుకూలత ఉంటుందని, ఆ దిశగా ముందుకెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.