Cyclone Fengal Updates: ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. భారీ వర్ష సూచన
Cyclone threat missed Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగడంతో తుపానుగా రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్ని సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు – ఈశాన్యంగా 200 కిలోమీటర్లు, తమిళనాడులోని నాగపట్టణానికి ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయముగా 470 కిలోమీటర్లు దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాగల 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తీవ్ర వాయుగుండం వాయవ్య దిశంగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలోని కరైకల్, మహాబలిపురం మధ్య నవంబర్ 30 ఉదయం సమయానికి తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ భావిస్తోంది.
ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా రానున్న 24 గంటలలో తిరుపతి, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తుపాను రూపాతరం చెందకపోవడంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు, గరిష్టంగా 65 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులెవరూ తదుపరి సూచన వచ్చే వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని అన్ని పోర్టులలో ఒకటివ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పొలం పనులు చేసుకునే వారు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణీ ప్రభావంపై ఇస్రో ప్రభుత్వానికి సంకేతాలిస్తుండగా.. ఈఓఎస్ 06, ఇన్సాట్ 3 డీఆర్ వంటి ఉపగ్రహాలు ఫంగన్ తుపాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిరంతం అందిస్తూనే ఉంటాయి.