India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

India vs New Zealand Champions Trophy 2025 Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, వరుసగా 15 వన్డేల్లో భారత్ టాస్ కోల్పోయింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 12 సార్లు టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, టోర్నీలో ఓటమి లేకుండా ఫైనల్ చేరిన జట్టుగా భారత్ వెళ్లడం విశేషం. అలాగే అంతకుముందు లీగ్ దశలో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీస్‌లో ఆడిన జట్టే బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ జట్టులో మాత్రం స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా మ్యాట్ హెన్రీ దూరమయ్యారు. దీంతో తుది జట్టులోకి నాథన్ స్మిత్‌కు అవకాశం లభించింది. ఇక, ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారత్‌కు మద్దతుగా పూజలు నిర్వహించారు. అలాగే రోహిత్ సేన గెలుపుతో భారత్ తిరిగి రావాలని నినాదాలు చేశారు.
తుది జట్లు ఇవే..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కేల్ జేమీసన్, నాథన్ స్మిత్, విలియమ్ రూరౌర్కీ