IPL 2025: ముంబైతో గుజరాత్ కీలక పోరు.. గెలిచేది వీళ్లే!

Gujarat Titans VS Mumbai Indians IN IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ అన్ని సీజన్ల కంటే ఉత్కంఠగా సాగుతోంది. అలాగే, ఇప్పటివరకు అన్ని జట్లు దాదాపు 10 మ్యాచ్‌లకు పైగా ఆడాయి. ఇందులో బెంగళూరు జట్టు 11 మ్యాచ్‌లు ఆడగా.. 8 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌ల్లో గెలవడంతో రెండో స్థానంలో ఉంది.
ఇక, ముంబై జట్టు 11 మ్యాచ్‌లు ఆడగా.. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 4 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో నంబర్ 3 స్థానంలో.. గుజరాత్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలుపొందగా.. 3 మ్యాచ్‌లు మాత్రమే ఓడింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. అయితే పాయింట్ల విషయానికొస్తే.. గుజరాత్ కంటే ముంబై ఒక్క మ్యాచ్ ఎక్కువగా ఆడినప్పటికీ రెండు జట్లు 14 పాయింట్లు పొందాయి. కానీ రన్ రేట్ పరంగా ముంబై 4వ స్థానంలో ఉంది.
ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ముంబై, గుజరాత్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే 16 పాయింట్లతో నంబర్ వన్ స్థానానికి ఎగబాకనుంది. ఒకవేళ గుజరాత్ గెలిస్తే.. 16 పాయింట్లతో రన్ రేట్‌తో టాప్ ప్లేస్ ఖాయం కానుంది. ఇరు జట్లు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడగా.. గుజరాత్ ఘన విజయం సాధించింది.
ఇందులో భాగంగానే ఈ మ్యాచ్‌లో ముంబై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ముంబై బ్యాటర్లలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అదే విధంగా రికెల్టన్ కూడా వేగంగా పరుగులు చేయడం ముంబైకు అదనపు బలం. అంతేకాకుండా మిస్టర్ 360 డిగ్రీస్ సూర్య భాయ్ విధ్వంసం సృషిస్తున్నాడు. ఆ తర్వాత బౌలింగ్ తో పాటు బ్యాటింగ్‌లో కెప్టెన్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తిలక్ వర్మ, నమన్, జాక్స్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా తిరిగి రావడం కలిసొచ్చింది. బౌల్ట్, చాహర్, కరణ్ కూడా ఆకట్టుకుంటున్నారు.
మరోవైపు, గుజరాత్ బ్యాటర్లు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్లో రెండో సారి ముంబైను ఓడించాలని స్కెచ్ వేశారు. గుజరాత్ బ్యాటర్లలో శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ భయంకరంగా ఆడుతున్నారు. ఇప్పటికే సుదర్శన్ 504 పరుగులు చేయగా..బట్లర్ 470, గిల్ 465 పరుగులతో భీకర ఫామ్‌లో ఉన్నారు. అలాగే వాషింగ్టన్ సుందర్, షారుక్, తెవాటియా కూడా అదనపు బలం అందిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, కిశోర్, రషీద్ కీలక సమయంలో వికెట్లు పడగొడుతున్నారు. ఈ మ్యాచ్ అటు ముంబైతో పాటు గుజరాత్ గెలిచేందుకు ప్రయత్నిస్తాయి. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫామ్ చేసుకునేందుకు ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి మరి.