Last Updated:

Bro Movie Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ “బ్రో” మూవీ రివ్యూ..

Bro Movie Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ “బ్రో” మూవీ రివ్యూ..

Cast & Crew

  • సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ (Hero)
  • కేతిక శర్మ (Heroine)
  • ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, సుబ్బరాజు, రాజా, 'వెన్నెల' కిషోర్, తనికెళ్ల భరణి, పృథ్వీ రాజ్, యువలక్ష్మి, అలీ రెజా తదితరులు (Cast)
  • సముద్రఖని (Director)
  • టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల (Producer)
  • ఎస్.ఎస్. తమన్ (Music)
  • సుజిత్ వాసుదేవ్ (Cinematography)
3.5

Bro Movie Review : మెగా హీరోలు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో”. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కేతికశర్మ హీరోయిన్ గా నటించింది. అలానే ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, సముద్రఖని, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.   ఇక ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పవన్, సాయి పోస్టర్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా రివ్యూ, రేటింగ్..

సినిమా కథ.. 

మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) ఇంటికి పెద్ద కొడుకు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు చూసుకుంటాడు. తనకు అసలు టైమ్ లేదంటూ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఆఫీసు పని మీద విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదంలో చనిపోయిన మార్క్ ఆత్మకు టైటాన్ అలియాస్ టైమ్ (పవన్ కళ్యాణ్) మరో ఛాన్స్ ఇస్తారు.  అలా మళ్ళీ వచ్చిన ఛాన్స్ తో భూమి మీదకు తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మార్క్ చెల్లెలు వీణ (ప్రియా ప్రకాష్ వారియర్) కథ ఏమిటి ? మార్క్ ప్రేమించిన రమ్య (కేతికా శర్మ) ఏమైంది ? కుటుంబాన్ని సెట్ చేశాడా..? చివరకు మార్క్ ఏం తెలుసుకున్నాడు? అనేది ఈ సినిమా కథాంశం.

మూవీ విశ్లేషణ..

మొదటి సారి మెగా హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో.. మరీ ముఖ్యంగా అభిమానుల్లో ఉండే అంచనాలు గురించి తెలిసిందే. వాటిని దృష్టిలో పెట్టుకుని ‘బ్రో’ చిత్రాన్ని.. ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ ఇచ్చేలా తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్  కనిపించే ప్రతి సన్నివేశాన్ని ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసినట్లు ఉంటుంది. ఇక పవన్ లుక్స్, పవన్ డైలాగ్స్ వింటేజ్ పవర్ స్టార్ ని గుర్తు చేస్తాయి.

పవన్ కళ్యాణ్ – సాయి తేజ్.. కలిసి ఓల్డ్ సాంగ్స్ కి చేసిన ర్యాంపేజ్.. ఫ్యాన్స్ అందరితో కేకలు పెట్టిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎంటర్టైన్ మెంట్ పరంగా అదరగొట్టిన ఈ మూవీ.. ఇక భావోద్వేగాల పరంగా కూడా అందరికీ టైమ్ వాల్యూ తెలిసేలా చేస్తుంది. ప్రీ క్లైమాక్స్ సాంగ్ టు క్లైమాక్స్ వరకు బాగా వర్కవుట్ అయ్యింది. సాయి తేజ్ పాత్రలో బలమైన సంఘర్షణ ఉంది. కుటుంబం కోసం తాను చాలా చేశానని, ఆ కుటుంబం తనకు చెప్పకుండా కొన్ని విషయాలు దాచిందని మథనపడే సీన్లు గానీ, ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని ఫీలయ్యే సీన్ గానీ బాగా చూపించారు.

బలమైన సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరువయ్యేలా తీయడంలో సముద్రఖని పూర్తిగా విజయం అయ్యారు. కొందరి ఫస్టాఫ్ కామెడీ నచ్చితే, మరికొందరికి సెకండాఫ్ ఎమోషన్స్ నచ్చుతాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం సాగదీశారు అనే ఫీల్ ఉంది.

ఎవరెలా చేశారంటే.. 

‘బ్రో’ కథలో అసలు హీరో సాయి తేజ్ అయినప్పటికీ.. ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చిందంటే కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. పవర్ స్టార్ కోసం థియేటర్లకు వెళ్ళిన అభిమానులకు ‘బ్రో’ ఫుల్ మీల్స్ పెడుతుంది. స్క్రీన్ మీద వింటేజ్ సాంగ్స్ వస్తుంటే.. అందరికీ స్టెప్పులు వేయాలని అనిపిస్తుంది. అలానే నటనలో కూడా ఫుల్ ఎనర్జీని మరోసారి కనబరిచారు. తన పాత్రకు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ న్యాయం చేశారు.

మార్క్ పాత్రలో సాయి తేజ్ ఓకే. కాకపోతే యాక్సిడెంట్ తర్వాత ఆయన డ్యాన్సులు కాస్త స్లో గా చేస్తున్నారు. నటుడిగా ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. కేతికా శర్మ పాటలో, కొన్ని సీన్లలో కనిపించి మెప్పించారు. ప్రియా ప్రకాష్ వారియర్ చెల్లెలి పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. తల్లిగా రోహిణి మరోసారి భావోద్వేగభరిత సన్నివేశాలు చేయడంలో తన అనుభవం చూపించారు. అందరితో కంటతడి పెట్టించేశారు.

ఇక వెన్నెల కిశోర్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, అలీ రెజా తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. బ్రహ్మానందం అతిథి పాత్రలో మెరవడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. తమన్ పాటలు ఓకే అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సాయి తేజ్ ఫ్లాష్ బ్యాక్ సాంగ్.. ఆ సీన్స్ కంటతడి పెట్టిస్థాయి. నేపథ్య సంగీతంలో తన మార్క్ చూపించారు తమన్. ‘బ్రో’ థీమ్ సాంగ్ నేపథ్యంలో వినిపించిన ప్రతిసారీ ఓ హై వస్తుంది అనడంలో సందేహం లేదు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బావుంది. మాటల్లో, స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది. కొన్ని మాటలే ఆకట్టుకుంటాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ నిర్మాణ విలువలు ఓకే.

కంక్లూజన్.. 

బ్రో.. కంప్లీట్ ఎంటర్టైనర్ విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్

ఇవి కూడా చదవండి: