ISRO: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి. నారాయణన్.. ఆయన ఎవరంటే?
V Narayanan as the new Chairman of the ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఆయన జనవరి 14న బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, నారాయణన్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఎస్.సోమనాథ్ ఉన్నారు. ఈయన పదవికాలం జనవరి 13తో ముగియనుంది. కాగా, ఆయన సారథ్యంలోనే చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది.
ఇక, వి. నారాయణన్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన 40 ఏళ్లుగా పలు కీలక స్థానాల్లో పనిచేశారు. అంతకుముందు నారాయణన్ సారథ్యంలోనే జీఎస్ఎల్వీ ఎంకే3 ద్వారా సీ25 క్రయోజెనిక్ ప్రాజెక్టు విజయవంతమైంది. అంతేకాకుండా ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అభివృద్ధికి ఆయన కృషి చేశారు. దీంతో పాటు ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ మిషన్లకు నారాయణన్ నాయకత్వంలోని బృందమే ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను రూపొందించింది.
నారాయణన్.. తమిళనాడులోని కన్యాకుమారిలో జన్మించారు. తమిళంలో ఇంటర్ వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి క్రయోజనిక్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు. తొలి ర్యాంకు సాధించడంతో ఆయనకు సిల్వర్ మెడల్ వరించింది. 1984లో ఇస్రోలో చేరిన ఆయన.. 2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే రాకెట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ విభాగంలో నారాయణన్ ప్రతిభ చాటారు. అనంతరం 2018లో ఎల్పీఎస్పీ డైరెక్టర్‌గా నియామకమయ్యారు.
కాగా, ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్ నియామకం జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రతిభకు కొదువ లేదని, నిర్ధిష్ట లక్ష్యంతో దేశం ముందుకు వెళ్తుందన్నారు. ఇస్రోను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. అయితే తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ 1ను ప్రయోగించగా.. ఈ మిషన్ విజయవంతంగా నడుస్తోంది.