ISRO: ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ డాకింగ్ ప్రయోగం వాయిదా.. కారణమిదే!
ISRO Postponds SpaDex Docking to January 9: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం నేడు జరగాల్సిన డాకింగ్ ప్రక్రియను జనవరి 9కి మార్చుతున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. మిషన్‌లో సమస్యను గుర్తించటం వల్ల, డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఇస్రో ప్రకటించింది.
సమస్య కారణంగా వాయిదా..
కాగా ఇస్రో డిసెంబర్ 30న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్‌లో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సీ 60 అనే రాకెట్ ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు. అనుకున్నట్లుగానే ఆ రోజున ప్రయోగం విజయవంతం కావటంతో ఆ రెండు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరాయి. ఈ రెండూ అంతరిక్షంలోనే డాకింగ్, అన్‌డాకింగ్ చేసేలా ప్రయోగాన్ని చేపట్టారు. కాగా, నేడు వృత్తాకార కక్ష్యలో 2 ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్ చేయాలని శాస్త్రవేత్తలు ప్రణాళిక సిద్ధం చేసినా, సమస్య రావటంతో జనవరి 9కి దానిని వాయిదా వేశారు.
డాకింగ్, అన్‌డాకింగ్ అంటే?
రోదసిలో ఉన్న రెండు వస్తువులను ఒకదానికొకటి అనుసంధానం చేయడాన్నే డాకింగ్‌గా పిలుస్తారు. ఇప్పుడు ఇస్రో చేపట్టిన ఈ స్పేడెక్స్ మిషన్‌లో ప్రయోగించిన ఛేజర్ అనే శాటిలైట్ దానితోపాటే అంతరిక్షంలోకి పంపించిన టార్గెట్ అనే మరో ఉపగ్రహాన్ని కనుగొని దానికి కనెక్ట్ అవుతుంది. రెండు రైలు బోగీలను ఒకదానికి ఒకటి జోడించినట్లు అన్నమాట. డాకింగ్‌కు వ్యతిరేక ప్రక్రియను అన్‌డాకింగ్ అంటారు. ఇందులో.. ఈ రెండు ఉపగ్రహాలు ఒకదాని నుంచి మరొకటి విడిపోతాయి. ఈ మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీంతో దీన్ని అటానమస్ డాకింగ్ అంటారు.
సక్సెస్ అయితే.. రికార్డే..
ఈ మిషన్‌లో ఛేజర్, టార్గెట్ అనే రెండు చిన్న ఉపగ్రహాలు.. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ, తర్వాత కలవటం, విడిపోవటం జరుగుతుంది. అత్యాధునిక సెన్సార్స్, అల్గారిథమ్‌ల సాయంతో ఈ డాకింగ్, అన్ డాకింగ్ జరుగుతాయి. ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్‌ను ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనా మాత్రమే చేయగలిగాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. దీంతో జనవరి 9న ఎలాంటి ఫలితం రానుందోననే ఆసక్తి నెలకొంది.