Sumit Sabharwal : నాన్నా.. పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా.. కెప్టెన్ సుమిత్.. ఇంతలోనే ఘోరం

Shiv Sena MLA consoles Sumit’s Father : అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలు దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లో కుప్పకూలింది. ఘటనలనో 241 మంది విమాన ప్రయాణికులు సహా మొత్తం 265 మంది దుర్మరణం చెందారు.
వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదం..
ఈ ఘటన వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయిన బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చివరి మాటలను తలచుకొని తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విమానం లండన్ బయలు దేరే ముందు సుమిత్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. లండన్ వెళ్లాక మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడని, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ బోరున విలపించారు.
సుమిత్ తండ్రిని ఓదార్చిన శివసేన ఎమ్మెల్యే..
ప్రమాదం జరిగిన తర్వాత శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే గురువారం రాత్రి ముంబయి శివారులోని పోవై ప్రాంతంలో ఉన్న సుమిత్ ఇంటికి వెళ్లాడు. ఆయన తండ్రిని కలిసి ఓదార్చారు. రెండేళ్ల కింద సుమిత్ తల్లి మృతిచెందింది. దీంతో 80 ఏండ్ల తండ్రి బాగోగులు అతడే చూసుకుంటున్నాడు. సుమిత్ ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు వెళ్తుండగా, ఇంట్లో తండ్రి ఒక్కరే ఉంటున్నారు. కొన్ని రోజుల కింద వయోభారంతో బాధపడుతున్న తన తండ్రికి నాన్నా పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటానని సుమిత్ మాటిచ్చాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందంటూ తన కుమారుడు చెప్పిన మాటలను తలుచుకొని తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సుమిత్‌కు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం కూడా ఉంది.