Justice Yashwant Varma: న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా సొమ్ము: ప్యానెల్ నివేదిక!
Setback for Justice Yashwant Verma: న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు బయటపడిన మాట వాస్తవమేనని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ధరించింది. వర్మ ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌గా పనిచేస్తున్న సందర్భంగా అధికారిక నివాసంలో పెద్దఎత్తున కాలిపోయిన నోట్ల కట్టలను గుర్తించారు. తాజాగా ప్యానెల్ 60 పేజీల నివేదికను ఇచ్చింది. ఇందులో 30 తుగ్లక్ క్రిసెంట్ రోడ్డులోని జస్టిస్ వర్మ అధికారిక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో నోట్ల కట్టలను గుర్తించడం వాస్తవమేనని పేర్కొంది. డబ్బులున్న స్టోరూమ్ నియంత్రణ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జస్టిస్ వర్మ లేదా అతడి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉందని అభిప్రాయపడింది. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నట్లు వెల్లడించింది. అగ్నిప్రమాదంలో దగ్ధమైన నోట్లను మార్చి 15న తెల్లవారుజామున అక్కడి నుంచి తొలగించడమే బలమైన సాక్ష్యమని వెల్లడించింది. నోట్లను జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల స్టోరూమ్‌లో ఉంచడం అనుమానాస్పదంగా ఉందని అభిప్రాయపడింది. కాలిపోయిన నోట్లు చిన్న నోట్లు లేదా తక్కువ మొత్తం కాదని వెల్లడించింది.
తమకు లభించిన ఎలక్ట్రానిక్, ప్రత్యక్ష ఆధారాలను దృష్టిలో ఉంచుకొని సీజేఐ ఆరోపణలు నిజమేనని తేలుతోందని నివేదిక పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు జస్టిస్‌గా ఉన్న వర్మను విధుల నుంచి తొలగించడానికి ఆధారాలు సరిపోతాయని అభిప్రాయపడింది.
నా జీవితంలో అంత సొమ్ము చూడలేదు : ప్రత్యేక సాక్షి
న్యాయమూర్తి వర్మపై దర్యాప్తులో భాగంగా పది రోజులపాటు 55 మంది సాక్షులను విచారించారు. వారి వాంగ్మూలాలను వీడియోలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఓ సాక్షి మాట్లాడారు. తను గదిలోకి వెళ్లానని, అక్కడ కుడివైపు నేలపై రూ.500 నోట్ల కట్టలు భారీగా పడున్నాయని గమనించి షాక్ గురైనట్లు తెలిపారు. తన జీవితంలో నేలపై అంత మొత్తం సొమ్ము పడి ఉండటాన్ని చూడలేదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో న్యాయమూర్తి వర్మ కుమార్తె దియా, ఆయన ప్రైవేట్ కార్యదర్శి రాజేందర్‌సింగ్ కార్కి తదితరులను ప్యానెల్ విచారించింది. అగ్నిమాపక సిబ్బంది తమ నివేదికలో నోట్ల వివరాలు నమోదు చేయకుండా రాజేందర్‌సింగ్ అడ్డుకొన్నట్లు తెలిసింది. కానీ, ఆరోపణలను ఆయన తిరస్కరించారు.
ఈ ఏడాది మార్చి 14వ తేదీన ఢిల్లీలోని న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికారిక ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పెద్ద మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. ఘటన అనంతరం మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్‌వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి, ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఇది నిజమేనని ధ్రువీకరించిన త్రిసభ్య కమిటీ సంబంధిత నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందించింది.