Maharashtra on Hindi Mandatory: హిందీపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలల్లో తప్పనిసరి కాదు
Maharashtra Govt. Removed Hindi Mandatory word: ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు హిందీ విధిగా బోధించాలని ఇటీవల మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. తాజాగా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తప్పనిసరి అనే పదాన్ని నోటిఫికేషన్ నుంచి తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బుధవారం ఆ రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో ‘తప్పనిసరి’ అనే పదాన్ని తొలగించింది. హిందీ భాషకు బదులు మరో భాషను ఎంచుకునే అవకాశం కల్పించింది. హిందీ నేర్చుకోవాలనుకునే తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు ఉండాలని పేర్కొంది. అప్పుడే హిందీ సబ్జెక్టు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఆ భాషకు సంబంధించిన ఉపాధ్యాయుడి నియామకం కుదరకపోతే ఆన్‌లైన్ ద్వారా తరగతులు జరుగుతాయని వెల్లడించింది.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లిష్, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. విధానాన్ని తమిళనాడు సర్కారు వ్యతిరేకిస్తోంది. ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన’అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతోపాటు ఉద్ధవ్ ఠాక్రే నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై పోరాడేందుకు ఠాక్రేలు ఏకం కానున్నారనే చర్చ మొదలైంది. ఈ సందర్భంగా మహారాష్ర్ట ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.