Chandrababu on CM Reavanth: కాళేశ్వరం ప్రాజెక్టుకు నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు : ఏపీ సీఎం చంద్రబాబు!
Chandrababu Naidu Responds to CM Revanth Reddy Comments: సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం సరికాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. గోదావరి నీళ్లను తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు.
మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? అని నిలదీశారు. తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదన్నారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చిన తర్వాత కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలని సూచించారు. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని పిలుపునిచ్చారు. ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువగా ఉన్నాయన్నారు. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకెళ్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులను కలిసి అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్‌రెడ్డి తమతో కలిసి రావాలని కోరారు. నాడు కేసీఆర్, జగన్ కలిసి రాయలసీమకు గోదావరి నీళ్లు తరలిస్తామన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ప్రాజెక్టు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు.