Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. ధ్వంసమైన బ్లాక్‌బాక్స్ విదేశాలకు..
Ahmedabad Plane Crash Air India Flight black Box sending to Foreign: ఈ నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో దాదాపు 270 మంది మృతిచెందారు. ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఘటనపై అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో కీలకమైన బ్లాక్‌బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలిసింది. బాక్స్‌లోని డేటాను విశ్లేషించేందుకు విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వాషింగ్టన్‌కు పంపే అవకాశం..
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ-171 విమానం ఈ నెల 12న కూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల్లో రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన 27 గంటల తర్వాత బ్లాక్‌బాక్సును బిల్డింగ్‌పై గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు బ్లాక్‌బాక్స్ చాలా కీలకం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బ్లాక్‌బాక్స్ దెబ్బతిన్నట్లు తెలిసింది. అందులోని డేటాను విశ్లేషించేందుకు దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
ప్రమాదం ధాటికి దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్..
సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్‌బాక్స్‌ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటల తట్టుకునేలా 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా బ్లాక్‌బాక్స్‌ను రూపొందిస్తారు. ప్రమాదానికి గల కారణం.. ప్రమాదానికి ముందు ఏం జరిగింది.. తదితర సమాచారంబ్లాక్‌బాక్సులో ఉంటుంది. సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. భవిష్యత్ ప్రమాదాలను నిరోధించడానికి బ్లాక్‌బాక్స్ ఉపయోగపడుతుంది. ఎయిర్ ఇండియా విమానం కూలని అనంతరం 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రమాదం ధాటికి బ్లాక్‌బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.