Pakistan: తప్పైంది క్షమించండి.. ఉగ్రవాదులను తయారు చేశామన్న మాజీ మంత్రి

Pakistan: పాకిస్థాన్ కు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఒప్పుకున్నారు ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గతంలో ఉగ్రవాద గ్రూపులతో దేశానికి ఉన్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నారు. పాకిస్థాన్ కు గతంలో కష్టమైన చరిత్ర ఉందన్నారు. అయితే ఇప్పుడు మాత్రం చాలా సంస్కరణలకు లోనయ్యామని చెప్పారు.
పాకిస్థాన్ కు ఒక గతం ఉండేదన్నారు. అది రహస్యం కాదని చెప్పారు. అయితే ప్రస్తుతం తాము ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం లేదన్నారు. తీవ్రవాదం వలన పాకిస్థాన్ చాలా కోల్పోయిందన్నారు. వరుస దాడులను ఎదుర్కొన్నాం. పాఠాలు కూడా నేర్చుకున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. ఇకపై అలాంటి అంశాలకు పాకిస్థాన్ లో స్థానం లేదు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో, పాకిస్థాన్ చరిత్రకు ఉగ్రవాద గ్రూపులకు మధ్య సంబంధాన్ని మీడియా ప్రతినిధి అడిగారు, ” మీరు ఒప్పుకుంటున్నారా, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు , శిక్షణ ఇచ్చిందని, నిధులు సమకూర్చిందని” అని అడిగితే…
“మేము దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసం ఈ నీచమైన పని చేస్తున్నాము. అందుకు బాధపడ్డాము. సోవియట్ యూనియన్‌తో జరిగిన యుద్ధంలో, 9/11 తర్వాత జరిగిన యుద్ధంలో మేము చేరకపోతే, పాకిస్తాన్ యొక్క ట్రాక్ రికార్డ్ నిందారోపణకు గురికాకుండా ఉండేది.” అని ఆసిఫ్ అన్నారు.
పహల్గాం ఘటనపై భారత్ పాకిస్థాన్ కు ఉచ్చు భిగించింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాంటీ టెర్రర్ ఆపరేషనల్ సన్నాహాల్లో భారత బలగాలు నిమగ్నమయ్యాయి. ఉగ్రదాడి ఉద్రిక్తతల మధ్య హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. 4 నెలల తర్వాత ధ్రువ్ హెలికాప్టర్లు ఎంట్రీ ఇచ్చాయి. సైన్యం అవసరాలను తీర్చడంలో హెలికాప్టర్లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడైనా ల్యాండ్ అయ్యేందుకు అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయని బలగాలు తెలిపాయి. ధ్రువ్ హెలికాప్టర్ల రాకతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఆపరేషనల్ కెపాసిటీ మరింత బలోపేతం అయ్యింది.