DGMO Meeting Postponed: భారత్- పాక్ మధ్య మీటింగ్.. సాయంత్రానికి వాయిదా!

India Pakistan DGMO meeting Postponed: భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా ఇరుదేశాలు పరసర్పం దాడులు చేసుకున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. 100 మంది వరకు ముష్కరులను మట్టుబెట్టింది. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైళ్లు ప్రయోగించగా.. వాటిని భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. మరోవైపు సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పులకు సరైన సమధానం ఇచ్చింది.
దీంతో కాళ్లబేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకువచ్చింది. అందుకు భారత్ కూడా ఒప్పుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపింది. ఈనెల 10న సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు కాల్పుల విరమణను పాటించాలని నిర్ణయించాయి. కానీ వంకర బుద్ధి ఉన్న పాకిస్తాన్ మాత్రం మళ్లీ దాడులు చేసింది.
అయితే కాల్పుల విరమణ, భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు ఇరుదేశాల డీజీఎంఓలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అవ్వాలని నిర్ణయించారు. అయితే అనుకోకుండా ఈ చర్చలు వాయిదా పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటలకు చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. భారత్ తరపున డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ తరపున మేజర్ జనరల్ ఖాసీఫ్ చౌదరీ చర్చించనున్నారు.
ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దు ఉల్లంఘనలు, భద్రతా సహకారం వంటి అంశాలపై మాట్లాడుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశం కీలకం కానుంది.