Isudan Gadhvi: గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్ధిగా మాజీ టివి యాంకర్.. పార్టీ ఎలా ఎన్నుకొన్నదంటే?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రమిస్తోన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రైతు బిడ్డ, టీవీ యాంకర్ గా పనిచేసిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు.
Gujarat: ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అధినేత కేజ్రీవాల్ ముచ్చటగా మూడో సీఎం పోస్టును తమ పార్టీ ఖాతాలో వేసుకొనేందుకు తహతహలాడుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రమిస్తోన్న కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రైతు బిడ్డ, టీవీ యాంకర్ గా పనిచేసిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు. సీఎం అభ్యర్ధిని పోల్ ద్వారా ప్రజలు ఎన్నుకొనే విధానాన్ని ఆయన కొనసాగించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పార్టీ ఓ ఫోన్ నెంబరును ఏర్పాటు చేసింది. సీఎం అభ్యర్ధిని ఎంచుకోవాలని కొన్ని పేర్లను సూచించింది. ఈ క్రమంలో గుజరాతీలు 49శాతంగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇసుదాన్ గఢ్వీని అత్యధికంగా బలపర్చారు. దీంతో ఆప్ గుజరాత్ ఇన్ చార్జ్ గోపాల్ ఇటాలియాను పక్కన పెట్టి సీఎం అభ్యర్ధిగా గఢ్వీ పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. నిర్వహించిన పోల్ లో 40ఏళ్ల ఇసుదాన్ గఢ్వీకి 73శాతం ఓట్లు వచ్చాయని కేజ్రీవాల్ వెల్లడించారు. ద్వారాకా జిల్లా పిపాలియా గ్రామంలోని ఓ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు.
ఈ సందర్భంగా గఢ్వీ భావోద్వేగానికి గురైనారు. ఓ రైతు బిడ్డకు కేజ్రీవాల్ ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని ఆనందం వ్యక్తం చేశారు. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నా తోటి గుజరాతీలకు అవసరమైనవి ఇవ్వాలనుకుంటున్నాని వ్యాఖ్యానించారు. నా తుది శ్వాస దాకా ప్రజలకు సేవా చేస్తానని మాటిచ్చారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న గుజరాత్ పీఠం ఎవరికి దక్కనుందో ఫలితాల్లో బయటపడనుంది.
ఇది కూడా చదవండి: CM Arvind Kejriwal: కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్ళ మూసివేత: సీఎం కెజ్రీవాల్