Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

Union Cabinet Meeting: కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీలో మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించారు.
అందులో భాగంగా యూపీలోని జీవర్ లో ఆరో సెమీకండక్టర్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కాగా యూపీ ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ యూనిట్ కు రూ. 3706 కోట్ల రూపాయల ఖర్చు కానుందని వివరించారు. యూనిట్ ఏర్పాటుతో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. కాగా దేశంలో సెమీకండక్టర్ల యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే మరో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఒక యూనిట్ లో ఈ ఏడాదిలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు.
సెమీ కండక్టర్ల యూనిట్ లో నెలకు 3.6 కోట్ల చిప్ ల ఉత్పత్తి జరుగుతుందని స్పష్టం చేశారు. హెచ్ సీఎల్, ఫాక్స్ కాన్ సంస్థల జాయింట్ వెంచర్ గా సెమీకండక్టర్ యూనిట్ ను ఏర్పరుస్తున్నామని చెప్పారు. 270 యూనివర్శిటీల్లో సెమీ కండక్టర్ టెక్నాలజీపై విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే సెమీ కండక్టర్ టెక్నాలజీపై 70 స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. స్టూడెంట్స్ రూపొందించిన 20 చిప్స్ ను మొహాలిలో ఉత్పత్తి చేసినట్టు వివరించారు. రాబోయే రోజుల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు రెడీ అవుతున్నారని పేర్కొన్నారు. 2027 నాటికి ఇండస్ట్రియల్ గా చిప్ ల ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. అలాగే నోయిడా, బెంగళూరులో డిస్ ప్లే చిప్స్ హబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతి ఐఐటీ విస్తరణకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.