KTR : డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం.. కేటీఆర్

KTR : డీలిమిటేషన్‌పై చర్చించేందుకు తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. చెన్నైలోని హోటల్ ఐటీసీ చోళలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన భేటీలో బీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్తో ఎన్నో నష్టాలు ఉన్నాయని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం వివక్షతో ఇప్పటికే సౌత్ రాష్ట్రాలు వెనకబడ్డాయని, ఆర్థికంగా చితికిపోతున్నాయని కామెంట్ చేశారు. కేంద్రం దేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అంకెలు పాలసీలను శాసించే పరిస్థితి ఉండకూదని తెలిపారు.
అన్నిరంగాల్లో రాణించే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని సూచించారు. కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనేక రంగాల్లో దక్షణాది రాష్ట్రాలు మంచి స్థితిలో ఉన్నాయని, కానీ తమ రాజకీయ శక్తిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించబోదని స్పష్టం చేశారు. కేంద్ర వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు తక్కువే తగ్గుతుందని కామెంట్ చేశారు. జనాభా ప్రాతిపదకన లోక్‌సభ సీట్లు పెరిగితే, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెప్పారు. దీంతో ప్రాంతీయ అసమానతలు తలెత్తే అవకాశ ఉందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కేంద్రం బిగ్ బ్రదర్లా ఉండాలి కానీ, బిగ్‌బాస్లా వ్యవహరించకూడదని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏళ్లపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారని చెప్పారు. 14 సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామన్నారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటామన్నారు. అస్తిత్వం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందన్నారు. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పని చేస్తుందన్నారు.
మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష మరింత పెరిగిందన్నారు. వివక్షను కొనసాగించేందుకు డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని మండిపడ్డారు. బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేయడం ఒక ఉదాహరణ అన్నారు. జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ జరిగితేనే దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.