Drugs: సిటీలో డ్రగ్స్ పట్టివేత.. నిందితుల్లో తిరుపతి కానిస్టేబుల్
Hyderabad: హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చాప కింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. కాగా ఏపీ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ ముఠాను ఎస్ఓటీ పోలీసులు ఇవాళ కూకట్ పల్లిలో పట్టుకున్నారు. కాగా పట్టుబడిన నిందితుల్లో ఏపీలోని తిరుపతికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఉండటం గమనార్హం.
పోలీసులు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ ఆపరేషన్స్ టీంకి చెందిన బృందాలు దాడి చేశాయి. వివేకానందనగర్ లో ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్ లోని కూకట్ పల్లికి రూ. 2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఇతర మాదక ద్రవ్యాలు, రూ. 50 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఏపీలోని అద్దంకికి చెందిన ఈ ముఠా చాలాకాలంగా కూకట్ పల్లి, వివేకానందనగర్ ఏరియాలో డ్రగ్స్ విక్రయిస్తోందని సమాచారం. కొద్ది రోజులుగా వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చివరకు పక్కా ప్లాన్ తో అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులను తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ (40), తిరుపతి రూరల్ వాసి సురేంద్ర (31), బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్ (34), షేక్ మస్తాన్ వలీ (40), దేవరాజు యేసుబాబు (29) ఉన్నారు.