GHMC Council Meeting: జీహెచ్ఎంసీ సమావేశంలో రభస.. మేయర్ రాజీనామా చేయాలన్న బీఆర్ఎస్ కార్పోరేటర్లు
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. అయితే సమావేశానికి ముందే ప్రధాన కార్యాలయం వద్ద నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్దరిల్లింది
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. అయితే సమావేశానికి ముందే ప్రధాన కార్యాలయం వద్ద నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్దరిల్లింది. జీహెచ్ఎంసీ ముందు ఫ్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేసుకున్నారు. ఆ తరువాత సమావేశం ప్రారంభమయ్యాక కూడా రచ్చ కొనసాగింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియంను చుట్టుముట్టారు.
మేయర్ ఆగ్రహం.. (GHMC Council Meeting)
బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల ఆందోళనతో 15 నిమిషాల పాటు సమావేశాన్ని వాయిదా వేశారు. మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడంతో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. పైగా మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ సీరియస్ అయ్యారు. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించాలంటూ కోరారు. చనిపోయిన కార్పొరేటర్లకు సంతాపం తెలియజేయకుండా అడ్డుపడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఒక బీసీ మహిళా మేయర్‌పై ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అభివృద్ధిపై సభలో చర్చ జరగాలని సూచించారు. చివరగా కార్పొరేటర్ల లాస్య నందిత మృతికి సంతాపం తెలిపారు.