Last Updated:

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి అస్వస్థత – ఆస్పత్రికి తరలింపు!

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి అస్వస్థత – ఆస్పత్రికి తరలింపు!

Posani Krishna Murali Admitted in Hospital: సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో జైలు పోలీసు అధికారులు ఆయనను రాజంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి పోలీసుల కస్టడీలో ఉన్నారు.

ఇటీవల ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. విద్వేషాలను రెచ్చగొట్టెలా వ్యవహరించిన ఆయనను బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్‌ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి.. పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోసాని కృష్ణమురళి వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

ఆయన ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి గురువారం రాత్రి రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచారు. శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్‌ పోసాని కృష్ణమురళికి మార్చి 13 వరకు 14 రోజులు రిమాండ్‌ విధించింది. దీంతో పోసానిని రాజాంపేట సబ్ జైలుకు తరలించారు.