Gadwal: గద్వాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా మొహరించిన పోలీసులు
Telangana: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు, సామాగ్రిని ధ్వంసం చేశారు. జేసీబీలను అడ్డుకున్నారు. కంపెనీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలిలో పోలీసులను భారీగా మొహరించారు. నిరసనలకు దిగిన రైతులను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దని కొన్ని రోజులుగా స్థానిక గ్రామాల ప్రజలు నిరసనలు చేస్తున్నారు. దీంతో ఆరు నెలలుగా నిలిచిపోయిన ఫ్యాక్టరీ పనుల్లో కదలిక రావడంతో రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి నిరసనకు దిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగతనంగా కంటైనర్లు, టిప్పర్లు, జేసీబీలను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఆ వెంటనే సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చి విధ్వంసం చేశారు. కంపెనీ సామాగ్రి, కార్లను ధ్వంసం చేసి తగలబెట్టారు.
ఫ్యాక్టరీ ఏర్పాటుపై గతంలో ఎమ్మార్వో, ఆర్డీఓ సమక్షంలో అభిప్రాయ సేకరణ చేశారు. 12 గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కాగా తమను రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు పలు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి.