చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ స్పెషల్ ఫోకస్ … ఆ పని చేయాలంటూ సూచన !
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై ఎన్‌ఎస్‌జీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఎన్‌ఎస్‌జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్ మంగళగిరి లోని టీడీపీ జాతీయ కార్యాలయాన్ని, ఉండవల్లి లోని చంద్రబాబు నివాసాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. ముందుగా పార్టీ ఆఫీస్ లోని చంద్రబాబు ఛాంబర్, ప్రచార రథాలను దగ్గరుండి పర్యవేక్షించిన ఎన్ఎస్‌జీ బృందం పార్టీ కార్యాలయ మేనేజర్ శ్రీకాంత్, పరుచూరి కృష్ణలకు పలు సూచనలు చేశారు.
ప్రచార రథంపై చంద్రబాబు ఎక్కడి నుంచి ప్రసంగిస్తారనే వివరాలు సేకరించిన ఎన్ఎస్‌జీ… ప్రచార రథంపై 6 ఫీట్ గ్లాస్ ఏర్పాటు చేయాలని పార్టీ సిబ్బందికి సూచించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు హైట్‌కి సరిపడా ఉండే గ్లాస్ ఏర్పాటు చేయాలని గ్రూప్ కమాండర్ కౌషియార్‌సింగ్ సూచనలు చేశారు. టీడీపీ కార్యాలయాల్ని, చంద్రబాబు నివాసాన్ని ఆయన పరిశీలించడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. కొద్ది నెలల క్రితమే చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రతను పెంచిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. అంతక ముందు పరిణామాలతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో 6-6 గా ఉన్న ఎన్‌ఎస్‌జీ భద్రతను పెంచారు. ప్రస్తుతం 12-12 ఎన్‌ఎస్‌జీ భద్రత మధ్య చంద్రబాబు పర్యటనలకు వెళుతున్నారు. కాగా చంద్రబాబు జిల్లా పర్యటనల్లో మళ్ళీ బిజీ అయ్యారు. నందిగామ వెళ్లిన సమయంలో రాళ్లు విసరడం, చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు పర్యటనలు ఉండటంతో ఎన్‌ఎస్‌జీ చంద్రబాబు భద్రతపై కీలక సూచనలు చేసింది.