AP: పంచాయతీలకు త్వరలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు జమ: పవన్ కళ్యాణ్
Pawan Kalyan Review Meeting: ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీలోనే ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటోందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఖాతాలను స్థంభింపజేసే గత ప్రభుత్వ అనైతిక విధానాలను తొలగించామని స్పష్టం చేశారు. స్థానికి సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి, పంచాయతీలకు రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వం మళ్లించిన రూ. 8 వేల కోట్లనిధులను తిరిగి జమచేయాలన్న సర్పంచుల విజ్ఞప్తులను ఆర్థిక శాఖ దృష్టికి తీసుకేళ్లామన్నారు. పంచాయతీలకు త్వరలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 750 కోట్లు జమవుతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. బలంగా ఉండాల్సిన చోట ప్రభుత్వం బలంగా ఉంటుందని, మెత్తగా ఉండాల్సిన చోట మెత్తగా ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వంలా పంచాయతీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం లేదని డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.