Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ అడుగుభాగంలో భారీగా గుంతలు
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాకశీర్షికల్లో ఉంటోన్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు 7వ బ్లాక్‌లోని 15వ గేటును ఇటీవల ఎత్తారు.
Medigadda Barrage: మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాకశీర్షికల్లో ఉంటోన్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు 7వ బ్లాక్‌లోని 15వ గేటును ఇటీవల ఎత్తారు. తాజాగా, 16వ నెంబర్ గేటు ఎత్తబోతే భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు కూడా శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో మరమ్మతు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఆ శబ్దాలు ఏమై ఉంటాయనే దానిమీద ఆరా తీస్తున్నారు. బ్యారేజీ కింద భారీ గొయ్యి ఏర్పడినట్లుగా అనుమానిస్తున్నారు. జియోఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. ఇలాగే మరమ్మతులు కొనసాగిస్తే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20, 21 పిల్లర్ల మధ్య గేటును తొలగించే ప్రక్రియలో భాగంగా గేటుకు అదనంగా ఉండే బీడింగ్‌లను తొలగించారు. బ్లాక్-7కు దిగువన ఏర్పాటు చేసేందుకు షీట్‌ఫైల్స్ ఇప్పటికే బ్యారేజీకి చేరుకున్నాయి.
ఇసుక కొట్టుకు పోవడం వల్లే..(Medigadda Barrage)
మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ అగాధం సైజ్ 12000 క్యూబిక్ మీటర్ల నుంచి 15000 క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చునని ఇటీవల నిర్వహించిన గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ టెస్ట్ ఆధారంగా ప్రాథమిక అంచనా వేశారు. ఈ అగాథం ఒకేచోట కాకుండా బ్యారేజీ పొడువునా కొన్నిచోట్ల పెద్దగా… కొన్నిచోట్ల చిన్నగా ఉంటుందని భావిస్తున్నారు. అగాధం లేదా గొయ్యి ఏర్పడిన ఏడో బ్లాక్‌లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయాయి. భారీ గేట్లు బరువు అధికంగా ఉంటాయి. ఈ భారీ గేటును పైకి ఎత్తే సమయంలో పునాదులపై ఒత్తిడి పెరిగి… బ్యారేజీ మరింత లోతుకు కుంగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే కింద ఉన్న అగాధాన్ని పూడ్చిన తర్వాతే గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు.