Last Updated:

Janasena Party: జనసేనకు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు.. గాజు గ్లాసు సింబల్ కేటాయిస్తూ ఉత్తర్వులు

Janasena Party: జనసేనకు ఎలక్షన్ కమిషన్ గుర్తింపు.. గాజు గ్లాసు సింబల్ కేటాయిస్తూ ఉత్తర్వులు

Election Commission designates Jana Sena Party as Recognised Regional party: ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో బాటు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై జనసేన శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ అభిమాన నటుడు, జనసేన అధినేత దశాబ్ద కాలపు కష్టానికి ప్రతిఫలంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలోనూ జనసేన అభ్యర్థులుగెలుపొందగా, తాజాగా ఈసీ నిర్ణయంతో రాబోయే ఎన్నికల నాటికి, పార్టీని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం జరగనుందని జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ ప్రక్షాళనకు నాంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 14 మార్చ్ 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజాస్వామ్యం బలపడాలన్నా, నిలబడాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా.. రాజకీయ పరమైన జవాబుదారీతనం కావాలనే అంశాన్ని ఆవిర్భావ సభలో పవన్ ప్రకటించారు. ప్రజల పక్షాన ప్రశ్నించేందుకే జనసేన పుట్టిందని స్పష్టం చేశారు. చీలిపోయిన సమాజాన్ని ఒక్కటి చేయటం, మత ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని ధ్వంసం చేయని అభివృద్ధి అనే 7 ప్రధాన సిద్ధాంతాలను నాటి ఆవిర్భావ సభలో ప్రస్తావించారు. అయితే పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో ఎన్నికలలో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి దోహదం చేశారు.

పోటీగా దూరంగా..
అయితే, తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుని ఎన్డీయేకే బేషరతుగా మద్దతును ప్రకటించింది. జనసేన మద్దతును ఆసరాగా చేసుకుని నాడు రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఆ తర్వాత ఎన్నాళ్లకూ విభజన హామీలు అమలుకాకపోవటం, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుండటంతో పవన్ 2018 మార్చిలో ప్రజల పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. ప్రత్యేక హోదాపై పదే పదే మాట మార్చిన నాటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, దీనిని పట్టించుకోని కేంద్రాన్ని పవన్ ఒంటరిగానే నిలదీశారు. ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఉద్దానం కిడ్నీ బాధితుల తరఫున, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాడటం వంటి పలు ప్రజాపోరాటాలు చేశారు. ఆ అయిదేళ్ల కాలంలో పార్టీ భావజాల వ్యాప్తికి, సామాజిక అధ్యయనాలకూ పార్టీ ప్రాధాన్యతనిస్తూనే ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది.

2019 ఎన్నికలు..
ఈ క్రమంలో 2019 ఎన్నికల నాటికి పార్టీ లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది. ఎన్నికల ముందు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని వైసీపీ చేసిన ఆరోపణలు చేసింది. కానీ, పవన్ మాత్రం వాటిని తిప్పికొట్టి, ఎన్నికల తర్వాత కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతాడంటూ.. జనసైనికులను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. ఆశించిన స్థాయి క్యాడర్ లేకున్నా, అన్నీ తానై పార్టీ ప్రచారం చేశారు. ప్రజారాజ్యం అనుభవాలతో వేరే పార్టీల నేతలనూ చేర్చుకోవటానికి గానీ, ధన రాజకీయానికి గానూ సిద్ధపడకుండా సాగిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో ఒక్కఛాన్స్ అంటూ సానుభూతి రాజకీయం చేసిన వైసీపీ వైపు ప్రజలు మొగ్గటంతో జనసేన అనుకున్న ఫలితానికి ఆమడదూరంలో నిలిచిపోయింది.

కేవలం రిజిస్టర్ పార్టీగానే
అయితే ఈ ఎన్నికలకు ముందు జనసేన సింబల్ విషయంలో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. అదే సమయంలో ఏపీ నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లో వైసీపీతో పాటు టీడీపీకి మాత్రమే చోటు దక్కింది. జనసేనకు మాత్రం రిజిస్టర్ పార్టీల్లో ఒకటిగానే ఈసీ గుర్తించింది. అంటే జనసేన పోటీ చేసిన చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించటం, ఆ పార్టీ లేని చోట ఆ గుర్తును స్వతంత్రులకు కేటాయించే అవకాశం ఉండే విధానాన్ని ప్రకటించగా, దీనిపై జనసేన న్యాయపోరాటం చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

ఒంటరి పోరాటం..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన అణిచివేత, ప్రజావ్యతిరేక విధానాల అమలు, అప్రజాస్వామిక పోకడల మూలంగా ఏపీ ప్రజలు, పార్టీలు చేష్టలుడిగి చూస్తున్న వేళ పవన్ ఒంటరిగానే జనంతో మమేకమయ్యారు. ఈ క్రమంలో అధికార పార్టీ అవహేళనలు, చిన్నపార్టీల సూటిపోటి మాటలను పంటిబిగువున భరించారు. ఎన్నికల నాటికి ఈ పార్టీయే ఉండదని వచ్చిన విమర్శలకూ బదులిచ్చారు. తుదిశ్వాస విడిచే వరకు పార్టీని నడపుతానని ప్రకటించారు. అటు పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సైతం వైసీపీలో చేరిపోవటంతో అసెంబ్లీలో జనసేనకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జనసేనకు గుర్తింపు లేకుండా పోయింది. దీంతో ‘అదీ ఒక పార్టీయేనా’అనే అవహేళనలు, న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయించి పార్టీ ఉనికిని అడ్డుకునే ప్రయత్నాలూ ఎన్నో జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్ర భవిష్యత్ కోసం గత ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీలతో కలిసి కూటమికి పవన్ ప్రాణప్రతిష్ట చేశారు. దానిని జనంలోకి తీసుకుపోయేందుకు తన జనాకర్షణను వినియోగించారు. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలనూ గెలవటమే గాక అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడటానికి దోహదపడింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలూ స్వీకరించారు. ఈ క్రమంలో తాజాగా, పార్టీకి శాశ్వత గుర్తింపుతో పాటు శాశ్వత గుర్తు కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది.

ఇది జనసైనికుల ఘనతే..
కాగా, ఈసీ ప్రకటనపై జనసేన పార్టీ ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేసింది. దశాబ్ద కాలంగా జనసేన అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు, త్యాగాలకు దక్కిన గుర్తింపు అంటూ పార్టీ ప్రస్తావించింది. సామాజిక మార్పుకోసం పవన్ కల్యాణ్ 2014లో పార్టీ స్థాపించారని గుర్తుచేసింది. నేడు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రతి జనసైనికుడికి, వీరమహిళలకు, నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపింది.

మార్చిలో ప్లీనరీ..
పార్టీ పెట్టి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 12 నుంచి పిఠాపురంలో ఘనంగా ప్లీనరీ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మూడు రోజుల పాటు సాగే ఈ ప్లీనరీలో పార్టీ విధి విధానాలు, భవిష్యత్ లక్ష్యాలు, జాతీయ, సామాజిక అంశాల మీద తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్లీనరీ చివరి రోజున భారీ బహిరంగ సభ నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నించటానికి పుట్టిన పార్టీ అయిన జనసేన నేడు ప్రజల మద్దతుతో అధికారంలో నిలవటమే గాక ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేయటానికి అవసరమైన భూమికను నిర్మించటంతో బాటు పార్టీ విస్తరణకు అవసరమైన వ్యూహాలను ఈ సమావేశాల్లో రచించుకోనుంది.